ఢిల్లీ సిక్సర్
రాజస్థాన్‌పై ఘనవిజయం
జేక్ ఫ్రెజర్, పొరెల్ మెరుపులు
ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుచేయగల సత్తా ఢిల్లీకి ఉందని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్న మాటలను క్యాపిటల్స్ నిజం చేసి చూపింది. తాజా సీజన్‌లో అందరికంటే ముందే ఎనిమిది విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరువైన రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ పంజా విసిరింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌లో జేక్ ఫ్రెజర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగితే.. అభిషేక్ పొరెల్, స్టబ్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లు.. భారీ స్కోరుకు బాటలు వేశారు. ఇక కొండంత లక్ష్యఛేదనలో కెప్టెన్ సంజూశాంసన్ ఉన్నంత వరకు పోటీలో కనిపించిన రాజస్థాన్ ఆ తర్వాత పరాజయం వైపు నడిచింది.
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం సొంతగడ్డపై జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ (20 బంతుల్లో 50; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ పొరెల్ (36 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టగా.. ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, సందీప్, చాహల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ సంజూ శాంసన్ (46 బంతుల్లో 86; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్వితీయ ప్రదర్శన కనబర్చగా.. మిగిలిన వాళ్లు పెద్దగా రాణించలేకపోయారు.యశస్వి జైస్వాల్ (4), బట్లర్ (19), పావెల్ (13), ఫెరీరా (1) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్, ముఖేశ్, కుల్దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కుల్దీప్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
సంజూ ఔటా.. కాదా
222 పరుగుల లక్ష్యఛేదనలో 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 159/3తో నిలిచింది. రాయల్స్ విజయానికి 30 బంతుల్లో 63 పరుగులు కావాల్సి ఉండగా.. సంజూక్రీజులో ఉండటంతో రాజస్థాన్ విజయంపై ఎవరికీ అనుమానాలు లేకపోయాయి. అయితే ముఖేశ్ వేసిన 16వ ఓవర్‌లో డ్రామా జరిగింది. నాలుగో బంతికి శాంసన్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్ బౌండ్రీ వద్ద హోప్ క్యాచ్ అందుకున్నాడు. బంతి అందుకునే క్రమంలో హోప్ కాలు బౌండ్రీను తాకినట్లు అనిపించడంతో థర్డ్ అంపైర్ పలుమార్లు పరిశీలించిన అనంతరం సంజూను ఔట్‌గా ప్రకటించగా.. శాంసన్ మాత్రం ఔట్ కాదనే ఉద్దేశంతో అంపైర్లతో చర్చించి అసహనంగా మైదానం వీడాడు. ఆ తర్వాత రాయల్స్ ఇన్నింగ్స్ గాడి తప్పింది.
ఇతడినా వదిలేసుకుంది!
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎందరో హిట్టర్లు వచ్చారు. ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడారు. మెక్‌కల్లమ్ నుంచి మొదలు గేల్, పొలార్డ్, రోహిత్, కోహ్లీ, ధోనీ, రాహుల్, యువరాజ్, సూర్య, రస్సెల్, నరైన్, డివిలియర్స్ ఇలా ఒకరా ఇద్దరా.. ఎందరో లెక్కలేనన్ని తుఫాన్ ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించారు. అయితే ఇందులో ఏ ఒక్కరూ రెండుసార్ల కన్నా ఎక్కువ 20 బంతుల్లోపూ అర్ధశతకాలు సాధించలేదు!
మరి అలాంటిది ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్‌లోనే ఓ నూనూగు మీసాల కుర్రాడు ఒకటికి మూడు సార్లు ఈ ఫీట్ అందుకుంటే ఏం అంటాం. వారెవ్వా.. తప్ప ఇంకేం అనగలం. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తున్న ఆ కుర్రాడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 15 బంతుల్లో, ముంబై ఇండియన్స్‌పై 15 బంతుల్లో, రాజస్థాన్ రాయల్స్‌పై 19 బంతుల్లో ఫిప్టీలు కొట్టాడు. అసలు క్రీజులోకి వచ్చిందే తడువు బౌలర్ ఎంతటి మొనగాడైనా పట్టించుకోకుండా.. సునామీలా విరుచుకుపడుతున్న ఆ యువ కెరటమే జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్
ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా.. లేక రెండు మూడు మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించినా ఆ ఆటగాడిని భారత జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదనే వాదన మొదలవడం పరిపాటే. తాజాగా టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన టీమిండియాలో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడంపై ఎంత చర్చ జరిగింది విధితమే. అలాంటిది.. బాదుడే పరమావధిగా సాగుతున్న ఈ నూనూగు మీసాల కుర్రాడిని మాత్రం ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ వరల్డ్‌కప్ ఎంపిక సమయంలో పట్టించుకోలేదు. బంతిని బలంగా బాదే నైపుణ్యంతో పాటు.. పవర్‌ప్లేలో గ్యాప్‌ల్లో నుంచి రాకెట్ వేగంతో బాల్‌ను బౌండ్రీ దాటించే నైపుణ్యం ఉన్న మెక్‌గుర్క్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా మెగాటోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో కనీసం ట్రావెల్ రిజర్వ్‌గా కూడా సెలెక్ట్ చేయలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం పాంటింగ్ అతడిని దగ్గర నుంచి గమనిస్తున్నాడు. మరో కంగారూ ఆటగాడు డేవిడ్ వార్నర్ స్థానంలో ఢిల్లీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగడం ప్రారంభించిన మెక్‌గుర్క్.. ఇప్పుడు డేవిడ్ భాయ్ స్థానానికే ఎసరు తెచ్చేలా దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్‌తో పోరులో బౌల్ట్ మెరుపు వేగంతో వేసిన బంతికి తీవ్రంగా గాయపడి విలవిలలాడిన ఫ్రెజర్ ఆ తర్వాత రాయల్స్ బౌలర్లను చీల్చి చెండాడిన తీరును ఎంత పొగిడినా తక్కువే. బౌల్ట్ తదుపరి ఓవర్‌లో 6,4,4 కొట్టిన ఫ్రెజర్.. అవేశ్ వేసిన నాలుగో ఓవర్‌లో 4,4,4,6,4,6 బాది 28 పరుగులు పిండుకున్నాడు. ఈ దెబ్బతో సీజన్‌లో మూడోసారి 20 బంతుల్లోపే (19 బంతుల్లో) అర్ధశతకం సాధించిన జేక్.. ఆ మరుసటి బంతికి ఔట్ కావడంతో రాయల్స్ ఊపిరి పీల్చుకుంది. అతడు ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 60 కాగా.. అందులో అతడి వాటా 50 అంటేనే జేక్ విధ్వంసం ఎలా సాగిందో ఊహించుకోవచ్చు.
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అన్నట్లు.. లీగ్‌లో లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన జేక్ ఫ్రెజర్ ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో 44.14 సగటుతో 309 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. మొత్తం మ్యాచ్‌లు ఆడిన స్టార ఆటగాళ్లు కూడా మూడొందల మార్క్ దాటేందుకు ఆపసోపాలు పడుతున్న తరుణంలో ఫ్రెజర్ మాత్రం వచ్చీ రాగానే క్రికెట్ ప్రపంచానికి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ పరుగులు అతడు 235.87 స్ట్రయిక్‌రేట్‌తో సాధించడం కొసమెరుపు.






