ఫెవరెట్‌గా గుకేశ్

08-05-2024 01:07:21 AM

 ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నీ 

వార్సా: క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మరో చెస్ టోర్నీకి సిద్ధమయ్యాడు. బుధవారం నుంచి వార్సా వేదికగా సూపర్‌బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. టాప్ ప్లేయర్స్ పాల్గొనే ఈ టోర్నీలో ర్యాపిడ్ చెస్‌లో 9 రౌండ్లు, బ్లిట్జ్‌లో 18 రౌండ్లు నిర్వహించి విజేతను ప్రకటించనున్నారు. గుకేశ్‌తో పాటు ఈ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి, గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద పాల్గొంటున్నారు. ఇక టోర్నీలో నార్వేకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్‌సన్‌పైనే అందరి దృష్టి నిలవనుంది. గుకేశ్, ప్రజ్ఞానంద, అనిష్ గిరి, నోదిర్‌బెక్‌లు మొత్తం టూర్‌కు అందుబాటులో ఉండనున్నారు. అందులో  క్లాసికల్, ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ విభాగాలు ఉన్నాయి. ఇక కార్ల్‌సన్, అర్జున్‌తో పాటు నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లేయర్స్ 5 ఈవెంట్స్‌లో నాలుగింటిలో పోటీ పడనున్నారు. టోర్నీలో గుకేశ్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది చివర్లో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లారెన్‌తో వరల్డ్ చాంపియన్‌షిప్ ఆడనున్న నేపథ్యంలో గుకేశ్ ఎలాంటి ప్రదర్శన ఇస్తాడన్నది ఆసక్తికరం. ఇక ప్రజ్ఞానంద ఇప్పటికే పలుమార్లు నంబర్‌వన్ కార్ల్‌సన్‌ను ఓడించి తన సత్తా ఏంటో ప్రపంచానికి ఇదివరకే తెలియజేశాడు.