6 July, 2026 | 9:08 AM

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బ్యాంక్ మేనేజర్

11-06-2024 10:44 AM

1 లక్ష 56 వేలు మాయం   

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: సైబర్ నేరాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాల్సిన ఓ బ్యాంకు మేనేజరే వారి చేతిలోనే బలయ్యాడు. పర్సనల్ లోన్ దరఖాస్తు చేసుకోవడంతో తన జిమెయిల్ కు వచ్చిన మేసేజ్ ను క్లిక్  చేసిన మేనేజర్ కు సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపారు. న్యూడ్ ఫొటోస్ షేర్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేయడంతో మేనేజర్ విడతలవారీగా రూ.1లక్ష 56 వేలు వారి ఖాతాలో జమ చేశారు. ఈ ఘటనపై బాధితుడు సోమవారం నాగర్ కర్నూల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్ పర్సనల్ లోన్ దరఖాస్తు చేసుకోగా తన మేలుకు లోన్ శాంక్షన్ పేరుతో లింకు వచ్చింది.

దానికి ఫోన్ నెంబర్ లింక్ చేయాలంటూ చేసిన ప్రాసెసింగ్ లో తన ఫోన్ హ్యాక్ అయినట్లు గమనించలేకపోయాడు. తన వాట్సాప్ డిపిని న్యూడ్ ఫోటో గా చిత్రీకరించి నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో వాళ్లు అడిగినట్లు డబ్బులు ఇచ్చుకుంటూ రావడంతో వాళ్ళ వికృతి చేష్టలకు భయపడి 1 లక్ష 56 వేల రూపాయలు ఇచ్చినా వదలలేదు. బ్యాంకు మేనేజర్ కాంటాక్ట్స్ లో ఉన్న 300 మందికి న్యూడ్ ఫోటోలను పంపి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బ్యాంకు మేనేజర్ చేసేదేమీ లేక తీవ్ర ఆవేదనతో నాగర్ కర్నూల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరగాళ్లనుపట్టుకునే పనిలో పడ్డారు.