బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
షేరుకు రూ.7.60 డివిడెండు
ముంబై, మే 10: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 2.3 శాతం స్వల్ప వృద్ధితో రూ.4886 కోట్ల కు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో బ్యాంకు రూ.4,775.33 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ముగిసిన త్రైమాసికంలో బీవోబీ నికర వడ్డీ ఆదాయం 2.3 శాతం వృద్ధిచెంది రూ.11,525 కోట్ల నుంచి రూ.11,793 కోట్ల కు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ స్వీక్వెన్షియల్‌గా 17 బేసిస్ పాయింట్లు పెరిగి 3.27 శాతానికి చేరింది. శుక్రవారం సమావేశమైన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.7.60 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో బీవోబీ షేరు 2.6 శాతం మేర క్షీణించింది. డివిడెండు చెల్లింపునకు జూన్ 28 రికార్డుతేదీగా నిర్ణయించింది.
తగ్గిన ఎన్‌పీఏలు
బ్యాంక్ ఆఫ్ బరోడా స్థూల మొండి బకాయిలు స్వీక్వెన్షియల్‌గా 3.08 శాతం నుంచి 2.92 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏలు 0.7 శాతం నుంచి 0.68 శాతానికి దిగివచ్చాయి. బ్యాంక్ దేశీయ డిపాజిట్లు 7.7 శాతం పెరిగి రూ.10.47 లక్షల కోట్ల నుంచి రూ.11.28 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ అడ్వాన్సులు 12.9 శాతం వృద్ధితో రూ.7.95 లక్షల కోట్ల నుంచి 8.98 లక్షల కోట్లకు పెరిగాయి. దేశీయ కాసా డిపాజిట్లు 5.4 శాతం వృద్ధితో రూ.4.66 లక్షల కోట్లకు పెరిగాయి.






