07-05-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, మే 6 (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై మండల స్థాయి బ్యాంకర్ల సమావేశాలు నిర్వహణ.రాజీవ్ యువ వికాసం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక మరియు బ్యాంకు లింకేజ్ ప్రక్రియలను సమీక్షించేందుకు జిల్లాలోని వివిధ మండలాలలో మండల స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశాలు నిర్వహించబడ్డాయి.
ఈ సమావేశాల్లో పథకం జిల్లా సమన్వయకర్త శ్రీ టి. నాగిరెడ్డి గారు పథకం మార్గదర్శకాలను వివరించి, ఎంపిక ప్రక్రియలో మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) మరియు బ్యాంక్ మేనేజర్లు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. దరఖాస్తులను పూర్తిస్థాయిలో యం.పి.డీ.ఓ.లు మరియు మున్సిపల్ కమీషనర్లు డెస్క్ వెరిఫికేషన్ పూర్తి చేసి వెంటనే సమర్పించాలని ఆయన సూచించారు.
మే 10వ తేదీ నాటికి తాత్కాలిక లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. భువనగిరి, బిబినగర్, బొమ్మలరామారం, పోచంపల్లి, తుర్కపల్లి, ఆలేరు, మోటకొండూర్, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా బీసీ మరియు మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీ యాదయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ కె. శివరామకృష్ణ బ్రాం మేనేజరు పాల్గొన్నారు.