calender_icon.png 23 August, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా హైరానా

23-08-2025 01:33:46 AM

రాష్ట్రంలో కొనసాగుతున్న యూరియా కొరత

  1. ఎరువుల కోసం కర్షకుల పడిగాపులు
  2. పోలీస్ బందోబస్తు నడుమ తలా రెండు బస్తాల పంపిణీ
  3. చంటిబిడ్డలతో గంటల పాటు నిల్చొన్న తల్లులు
  4. మహబూబాబాద్ జిల్లాలో అంగట్లో అధిక ధరకు యూరియా
  5. మంత్రి వివేక్ పర్యటనతో మంచిర్యాలలో గోదాముకు తాళం

విజయక్రాంతి నెట్‌వర్క్, ఆగస్టు 22: రాష్ట్రంలోని రైతన్నలు యూరియా కోసం నానా హైరానా పడుతున్నారు. కేంద్రం నుంచి సరిపడా నిల్వలు రాకపోవడంతో కొరత ఏర్పడింది. నాటు వేసిన 20 రోజుల్లోనే వరికి యూరియా అందించాల్సి రావడం.. మరోవైపు ఫర్టిలైజర్ దుకాణాల్లో కొరత నెలకొనడం తో రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. దీంతో గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల ఆక్రందనలు నిత్యకృత్యమయ్యా యి.

మంచిర్యాల జిల్లాలో కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటన నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారన్న అనుమానంతో గోదాముల వద్ద అన్నదాతలు గుమ్మిగూడ కుండా బయట నుంచి తాళం వేసి యూరియా పంపిణీ చేశారు. బయట ఉంటే గాలైనా ఆడేది, మంత్రి పర్యటనతో మమల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లాలో 8238 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నాయని అధికారులు ప్రకటించినా, తమకెందుకు సరఫరా చేయడం లేదంటూ నిలదీశారు.

తమ దీనస్థితిని అవకాశంగా మలుచుకొనేందుకు అధికారులు, ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు యత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని విమర్శిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక్కో బస్తా వెనుక రూ.133 అధికంగా వసూలు చేసి, సొమ్ము చేసుకుం టున్నారని రైతులు ఆరోపించారు. ఒక్కో బస్తా ధర రూ.267 కాగా, రూ.400 వసూ లు చేస్తున్నారని రైతులు వాపోయారు.

లారీల కొద్ది యూరియా వస్తున్నా, ఆధార్‌కార్డుపై రెండే బస్తాలను ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. పెద్దకొత్తపల్లి మండలకేంద్రంలోని నడిరోడ్డుపై లారీ యూరియాను అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తాము గంటల కొద్ది క్యూలైన్‌లో నిల్చొంటే ఒక్క బస్తా దొరకకపోగా, అంగట్లో అధిక ధరకు విక్రయిం చడమేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరించారు.

పెద్దకొత్తపల్లి మండలకేంద్రంలో ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమాని అధికారులతో కుమ్మక్కై లారీల కొద్ది యూరియాను అక్రమంగా తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. పనులన్నీ వదులుకొని కుటుంబసమేతంగా ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట తదితర ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు సింగిల్ విండో కార్యాలయాల వద్ద ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు.

పోలీస్ బందోబస్తు నడుమ రైతులకు ఆధార్ కార్డుపై ఒక్కోబస్తా చొప్పున ఇచ్చి పంపించేశారు. వరుసలో నిల్చొని కాళ్లు నొప్పులు పెట్టడంతో తమ చెప్పులను వరుసలో పెట్టారు. పంపిణీ చేస్తున్న ఒక్క బస్తాను తీసుకెళ్లి ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. త్వరలోనే స్టాక్ వస్తుందని, అప్పుడు అందరికీ సరిపడా యూరియాను సరఫరా చేస్తామంటూ అధికారులు సమాధానమిచ్చారు. మహబూ బాబాద్ జిల్లాలోని నెల్లికుదరు, బయ్యారం, కేసముద్రం, ఇనుగుర్తి తదితర మండలాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరారు.

జిల్లాలో సాగు పూర్తయిన వరికి 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, కేవలం 22 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే జిల్లాకు కేటాయించినట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయలేకపోతున్నామని వాపోయారు. మహబూబాబాద్ జిల్లాలోని పలు సింగిల్ విండో కార్యాలయాలకు తల్లులు తమ చంటిబిడ్డలతో ఎరువుల కోసం క్యూలైన్లలో వేచిఉండటం దయనీయ పరిస్థితికి అద్దం పట్టింది.

ప్రైవేట్ ఎరువుల దుకాణాల వాళ్లు తమవద్దకు వచ్చే మోతుబారి రైతులకు మాత్రమే అధికమొత్తంలో యూరియా పంపిణీ చేస్తూ, చిన్న,సన్నకారు రైతులకు మాత్రం మొండిచేయి చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధిక సంఖ్యలో రైతులు ఎరువుల కోసం వేచి ఉండటంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదరులో ఎస్‌ఐ రమేశ్‌బాబు మైక్ అనౌన్స్ మెంట్ ద్వారా రైతుల పేర్లు పిలిచి ఎరువుల సరఫరా సక్రమంగా సాగేలా చూశారు.

ఎంపీ రఘునందన్‌రావుకు నిరసన సెగ

మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు రైతుల నిరసన సెగ తగిలింది. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం శంకర్‌రావు పేటలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన్ను, నారాయణరావుపేటలో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కేంద్రం నుంచి యూరియా ఎందుకు సరఫరా కావడం లేదంటూ నిలదీశారు.

యూరియాపై కేంద్రమంత్రులు, ఎంపీలు, లీడర్లు పొంతన లేని మంటలు మాట్లాతున్నారని మండిపడ్డారు. యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. నిరసన తెలుపుతున్న నాయకులు తమ ఫోన్ నెంబర్లు ఇవ్వాలని, ఇప్పటివరకు రాష్ట్రానికి ఎంత యూరియా పంపిణీ చేశామో వివరాలు అందిస్తామంటూ సమాధానం చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రైతులకు మద్దతుగా ఆందోళన..

యూరియా కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు ఆయా పార్టీల మద్దతు లభిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వారితో కలిసి నిరసనలో భాగస్వామ్యమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బతుకులతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

నల్లగొండ జిల్లాలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కేంద్రప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తోందని నల్లగొండ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులతో కలిసి కలెక్టరేట్ ఏవో మోతీలాల్‌కు వినతిపత్రం అందించి రైతులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అందించాల్సిన కమీషన్ కోసమే ఫర్టిలైజర్ దుకాణాల వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించారని ఆరోపించారు. పత్రికలే యూరియా కొరత సృష్టిస్తున్నాయంటూ మంత్రి పొన్నం వ్యాఖ్యానించాడం, కొరత ఉందని మంత్రి పొంగులేటి చెప్పడం వాళ్ల ద్వంద్వ వైఖరికి నిదర్శమని ఆరోపించారు. మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రైతులతో కలిసి శుక్రవారం రామాయంపేటలో గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

యూరియా కోసం రైతులు అల్లాడుతున్నా, వ్యాపారులు ఎరు వులను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం సరికాదన్నారు. రెండు రోజుల్లో సరిపడా యూరి యా పంపిణీ చేయకుంటే జాతీయ రహదారిపై ఆందోళన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు.