23-08-2025 01:24:40 AM
32 గ్రామపంచాయతీలలో పండగలా పనుల జాతర
గరిడేపల్లి,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం,ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా ద్వారా మహిళలకు జీవనోపాధి కలుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్ ప్రసాద్ తెలిపారు.మండల కేంద్రమైన గరిడేపల్లిలో శుక్రవారం కింద చేపట్టిన జీవనోపాధి అభివృద్ధి పనులను లబ్ధిదారులచే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసాలో భాగంగా వ్యక్తిగత పనులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తారని తెలిపారు.దీనిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గరిడేపల్లిలో ఈ పథకం ద్వారా నిర్మించిన పశువుల కొట్టాలను లబ్ధిదారులు గుండు కలమ్మ, మండవ శాంతల చేతుల మీదుగా ప్రారంభించారు.
మండలంలోని 32 గ్రామ పంచాయతీల పరిధిలో పండగలా పనుల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను నిర్వహించారు.ఉపాధి హామీలు ఎక్కువ రోజులు పనిచేసిన కానుగు పద్మ గ్రామపంచాయతీ సిబ్బంది ఉత్తమ సేవ అందించిన మల్టీ పర్పస్ వర్కర్ మరియమ్మ బిక్షం గుర్తించి వారిని శాలువాతో సన్మానించారు. గ్రామ సభలో 2025 వ సంవత్సరం పనుల జాతర పై వివరించారు.