8 July, 2026 | 2:38 AM

ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

08-07-2026 02:08 AM

ములకలపల్లి,జూన్ 7, (విజయక్రాంతి): ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎస్టీ బాయ్స్ హాస్టల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ లను సందర్శించి హాస్టల్ లల్లో నెలకొన్న సమస్యలను గుర్తించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎస్టీ బాయ్స్ హాస్టల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చెపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బాయ్స్ హాస్టల్ లో విద్యార్థుల పై కోతులు దాడి చేస్తున్నాయని కోతుల దాడి నుండి విద్యార్థులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఎస్టీ బాయ్స్ హాస్టల్ లో బిల్డింగ్ పై పెచ్చులు ఊడి విద్యార్థుల బెడ్ల పై పడుతుందని నిరుపయోగంగా ఉన్న బిల్డింగ్ లో నుంచి విద్యార్థులను సురక్షిత బిల్డింగ్ లోకి వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.

మరుగు దొడ్లు అదనంగా మరో మూడు నిర్మించాలన్నారు. హాస్టల్స్ లో ఏఎన్‌ఎమ్ లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. దుప్పట్లు,బెడ్లు, ట్రంక్ పెట్టెలు, దోమ తెరలు,విద్యార్థులకు యూనిఫాం తక్షణమే అందించాలని, హాస్టల్ లో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.

హాస్టల్ లో నెలకొన్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారించకపోతే రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గోపగాని లక్ష్మీనరసయ్య,బైరు ప్రసాద్, గడ్డం వెంకటేశ్వర్లు,కాంపసటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.