8 July, 2026 | 3:09 AM

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

08-07-2026 02:07 AM
  1. జూలై 7 విద్యార్థుల నిరసన ప్రదర్శన విజయవంతం
  2. జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలి

కొత్తగూడెం, జులై 7, (విజయక్రాంతి): వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం నిర్వహించిన విద్యార్థుల నిరసన ప్రదర్శన విజయవంతమైంది. స్థానిక రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు వందలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నాగక్రిష్ణ , పిడిఎస్ యు  జిల్లా అధ్యక్షులు బుర్ర వీరభద్రం , పీడీఎస్ యు జిల్లా కార్యదర్శి మునిగెల శివప్రశాంత్ , ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ , పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి దుగ్గం ప్రణయ్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP2020) పేరుతో విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ దిశగా నడిపిస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు తగ్గించడం, విద్యా రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించి బలోపేతం చేయాలనీ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అన్ని ఖాళీ అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, అక్రమ ఫీజులు, బలవంతపు పుస్తకాలు,యూనిఫాంల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలనీ,

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలనీ, హాస్టళ్లు, మెస్, తాగునీరు, పరిశుభ్రత తదితర మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలనీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలనీ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జూలై 10న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.