8 July, 2026 | 2:42 AM

సింగరేణికి తాడిచర్ల-2

08-07-2026 01:37 AM
  1. వేలం లేకుండా నేరుగా సంస్థకు అప్పగింత
  2. ప్రధాని మోదీ అంగీకారంతో ఫైల్‌పై సంతకం  
  3. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
  4.    182 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఛాన్స్
  5.    40-50 ఏళ్ల పాటు తవ్వేంత నిల్వలు 
  6. రాష్ట్రానికి, సంస్థకు భారీగా ఆదాయం, ఉపాధి అవకాశాలు
  7. నా వంతుగా సింగరేణికి అండగా ఉంటున్నానని స్పష్టీకరణ

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2 బొగ్గు గనులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమి టెడ్ (ఎస్‌సీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కేటాయించింది. అందుకు సంబంధించిన ఫైల్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంగీకారంతో సంతకం చేశాను. తాడిచర్ల-2 బ్లాక్‌లో 182 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఉంది. 40-50 ఏళ్ల పాటు అక్కడ తవ్వకాలు జరపవచ్చు.

ఈ బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు చాలా మంది సీఎంలు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. నా వంతు గా సింగరేణికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నా’ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.  తాడిచర్ల-2 బొగ్గు గనులను కేంద్రం వేలం పాట ద్వారా కాకుండా, నేరుగా సింగరేణికి కేటాయించడం సంతోషకరం అని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సింగరేణి లక్షలాది ప్రజల గుండెచప్పుడు అని, సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లుగా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణం, అటవీ అనుమతుల విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు సహకరిస్తుందన్నారు. ఉత్పత్తి పెంచు కోవడం, ఖర్చు తగ్గించుకోవడం వంటి అం శాలపై యాజమా న్యానికి సూచనలు చేశానన్నారు.

తాను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత..  ఒడిశా ముఖ్య మంత్రితో మాట్లాడి ఆ రాష్ట్రంలోని నైని బ్లాక్‌ను సింగరేణికి ఇప్పించానని, అక్కడ విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి అవుతుందన్నారు.  నైని కోల్ బ్లాక్‌లో సుమారు 340 మిలియన్ టన్నుల నిల్వలు న్నాయని, అ క్క డ 30 -35 ఏళ్ల వరకు తవ్వకాలు జరపవచ్చని,  ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని మంత్రి వెల్లడించారు.  దీని వల్ల సింగరేణికి సుమారు రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.

ప్రధానమంత్రి అనుమతితోనే..

మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పలువురు సీఎంలు తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి ఇవ్వాలని  లేఖలు రాశారని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘా లు, సింగరేణి యాజమాన్యం కూడా డి మాండ్ చేసిన విషయాన్ని మంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. 

తెలంగాణ అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, కార్మికులు, రాష్ట్ర ప్రజల సం క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. న్యాయపరమైన సలహాలు తీసుకొని, ప్రధానమంత్రిని కలిసి తాడిచర్ల-2ను సింగరేణికి కేటాయించాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు ప్రధాని సానుకూలత వ్యక్తం చేసి అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాని అంగీకారంతోనే తాడిచర్ల -2 కోల్ బ్లాక్ ఫైల్‌పై సంతకం చేశానని చెప్పారు.  

ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి..

తాడిచర్ల -2 బ్లాక్ ద్వారా  ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని మంత్రి తెలిపారు. ఇక్కడ లభ్యమయ్యే బొగ్గు క్వాలిటీ గ్రేడ్--8 అని, ఇది మంచి నాణ్యమైనదన్నారు. ఈ గని ద్వారా రూ.64,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందన్నారు. నేరుగా సింగరేణికి ఇవ్వడం వల్ల సంస్థకు కనీసం రూ.2,550 కోట్లు మిగులుతుందని చెప్పారు. అదేవి ధంగా తెలంగాణ ప్రభుత్వానికి రాయల్టీ సహా వివిధ మార్గాల్లో దాదాపు రూ.16వేల కోట్ల వరకు రాబడి ఉంటుందని మంత్రి తెలిపారు.    

1,200 ఉద్యోగాలకు అవకాశం..

తాడిచర్ల -2 బ్లాక్ ద్వారా సుమారు 1,200 అదనపు ఉద్యోగాలు వస్తాయన్నారు. నైని కోల్ బ్లాక్‌లో 1,500 కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుందన్నారు. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కేంద్రం ప్రమేయం లేనప్పటికీ..  తెలంగాణ బిడ్డగా తాను చొరవతీసుకుని, స మీక్షలు నిర్వహించి, సంస్థ పురోగతికి  ప్రయ త్నం చేస్తున్నాని చెప్పారు. అదే విధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్ (నాగపూర్), సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఖర్చులు అన్నింటిపై సర్వే చేసి కేంద్రానికి వివరాలు తెలియజేశానని, సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన అన్నిచోట్లా ఉందన్నారు.

నైని బ్లాక్ విషయంలోనూ ఇలాంటి నిబంధన ఉన్నప్పటికీ అది సెల్ఫ్ డిక్లరేషన్ (నేను వెళ్లాను, నేను చూశా ను. భవిష్యత్తులో దీనిపై ఎలాంటి అభ్యంతరాలొచ్చినా అది నా బాధ్యతే అని ఆ గనిని వేలంలో దక్కించుకున్న వ్యక్తి చెప్పాలి) అని  నిర్ణయించామన్నారు. నైని కోల్ బ్లాక్‌కు ఉ న్న సమస్యలు తొలగిపోయినట్లు తెలిపారు.