calender_icon.png 12 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు పోరాటం

12-12-2025 02:23:00 AM

  1. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ మంత్రులతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భేటీ

ప్రాజెక్టు అంచనాను అప్రైజల్ కమిటీ నిలిపేయడంపై ప్రధానంగా చర్చ

ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై న్యాయ పోరాటానికి యోచన

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఫలితాలు వెలువడిన కీలక సమయంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భేటీ తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. గురువారం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు.

అయితే ఈ సమావేశంలో ‘పాలమూరు రంగారెడ్డి’ ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ విషయంలో కేంద్ర జలవనరుల సంఘంలోని అప్రైజల్ కమిటీ డైరెక్టరేట్ నీటి వాటాపై సుప్రీం కోర్టు లో తీర్పు వెలువడే వరకూ అంచనా వేయడం సాధ్యం కాద ని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో ప్రాజెక్టుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించినప్పటికీ, అటవీ, ఇతర క్లియరెన్స్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

కృష్ణా జలాల వివాదాల కారణంగా, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాను నిరాకరించింది. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, దీనిపై న్యాయ పోరాటం చేయడంపై సమావేశంలో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. ప్రాజె క్టుకు సంబంధించి రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై ఆరా తీసినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై పోరాటం చేయడంలో భాగంగా కేసీఆరే రంగంలో దిగనున్నట్టు తెలుస్తోంది.