రాజన్న ఆలయ నియమాలపై భక్తుల వినతి
సాంప్రదాయ దుస్తుల ధారణ అమలు- సెల్ ఫోన్లపై నిషేధం
వేములవాడ,(విజయక్రాంతి): ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో(Sri Rajarajeshwara Swamy Temple) ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు కఠిన నియమాలు అమలు చేయాలని కోరుతూ భక్తులు ఆలయ ఈఓకు వినతిపత్రం సమర్పించారు. దర్శనానికి వచ్చే భక్తులకు సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేయడం, ఆలయ పరిధిలో సెల్‌ఫోన్ వినియోగంపై నిషేధం విధించడం వంటి అంశాలను వారు ప్రస్తావించారు. వినతిపత్రంలో పురుషులు పంచె లేదా కుర్తా–పైజామా, మహిళలు చీర లేదా దుపట్టాతో కూడిన చుడీదార్ ధరించి రావాలని నిబంధనలు తీసుకురావాలని సూచించారు. చిరిగిన జీన్స్, షార్ట్స్ వంటి ఆధునిక దుస్తులు ఆలయ మర్యాదకు విరుద్ధమని పేర్కొన్నారు.
అదేవిధంగా గర్భగుడి, క్యూ లైన్లలో సెల్‌ఫోన్ల వినియోగం వల్ల భక్తి వాతావరణం భంగం కలుగుతోందని తెలిపారు. సెల్ఫీలు, ఫోటోలు తీసే క్రమంలో ఇతరులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఫిర్యాదు చేశారు. అందుకే ఇతర ప్రధాన క్షేత్రాల మాదిరిగా ఫోన్లను పూర్తిగా నిషేధించి, భద్రపరిచేలా క్లాక్‌రూమ్ సదుపాయం కల్పించాలని కోరారు.ఈ నిబంధనలు ప్రధాన ఆలయంతో పాటు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, వేములవాడ,ఇతర అనుబంధ దేవాలయాలకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.వినతిపత్రం సమర్పించిన నరేష్ పటేల్, విశాల్ కుమార్ మాట్లాడుతూ ఆలయ పవిత్రత పరిరక్షణలో ప్రతి భక్తుడికి బాధ్యత ఉందన్నారు. తిరుమల తరహాలో కఠిన డ్రెస్ కోడ్ అమలు చేస్తే క్షేత్ర గౌరవం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. భక్తుల అభ్యర్థనపై ఆలయ అధికారులు సానుకూలంగా స్పందించి, అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




