బీసీ అట్రాసిటీ చట్టం చేయాలి
- నేడు ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా
- టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మార్చి1(విజయక్రాంతి): బీసీ సమాజంపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అన్యాయాలను అరికట్టేందుకు ప్రత్యేక బీసీ అట్రాసిటీ చట్టం తక్షణం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో బీసీ వర్గాలపై నిరంతరం జరుగుతున్న దాడులు, అవమానాలు, సామాజిక-ఆర్థిక అన్యాయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బాధితులకు సరైన రక్షణ, న్యాయం, చట్టపరమైన భరోసా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉన్నట్లుగా బీసీలకు కూడా ప్రత్యేక అట్రాసిటీ చట్టం తీసుకురావాలని టీఆరీప స్పష్టంగా డిమాండ్ చేస్తోం ది. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలు ఈ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, వారికి న్యాయమైన రక్షణ లేకపోవడం విచార కరమన్నారు.
ఈ మహా ధర్నా ద్వారా ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వబోతున్నామని, బీసీ అట్రాసిటీ చట్టం అమలు చేసే వరకు ఉద్యమం ఆగదని మల్లన్న హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, యువజనులు, మహిళలు, విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




