26 June, 2026 | 3:46 PM

డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలి: ఏసీపీ తిరుపతిరెడ్డి

26-06-2026 03:04 PM

ఖమ్మం రూరల్,(విజయక్రాంతి): మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబం, సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలు, సామాజిక సేవల వైపు దృష్టి మళ్లించాలని సూచించారు.

డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక యువతతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ సీఐ, ఎస్‌హెచ్‌ఓ, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక యువకులు పాల్గొన్నారు.