19 June, 2026 | 2:27 AM

కాస్త ముందుగానే ఐపీఎల్ 2027

19-06-2026 12:58 AM

మ్యాచ్‌ల సంఖ్య పెంచేది లేదన్న బీసీసీఐ

ముంబై, జూన్ 18: ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది. వచ్చే సీజన్ నుంచి లీగ్‌ను కాస్త ముందుగానే ప్రారంభించాలని యోచిస్తోంది. మార్చి 2వ వారం నుంచే మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా హింట్ ఇచ్చారు.

ఎండలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఆటగాళ్లు, అభిమానులు ఇబ్బంది పడటంతో పాటు.. మ్యాచ్ నిర్వహణ కూడా కష్టంగా మారుతోందన్నారు. సాధారణంగా అయితే మార్చి చివరి నుంచి మే చివరి వరకు ఉండే ఐపీఎల్ షెడ్యూల్ ఉంటుంది. ఐపీఎల్ 2026 షెడ్యూల్ సైతం.. మార్చి 28న మొదలై, మే 31 వరకు కొనసాగింది. దానిని ఇకపై మార్చి 10 నుంచి మే 15 మధ్యకు మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయని దేవజిత్ సైకియా వెల్లడించారు.

అన్నీ అనుకున్నట్లు సాగితే 2027 ఐపీఎల్ సీజన్.. మార్చి రెండో వారంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రుతుపవనాల రాకకు ముందు కురిసే వర్షాల కారణంగా ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌లు ప్రభావితం అవుతున్నాయని దేవజిత్ సైకియా పేర్కొన్నారు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో పాల్గొనే జట్ల సంఖ్య 10కి చేరినప్పటి నుంచి మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరుగుతుందన్న చర్చ జరుగుతూనే ఉంది.

తాజాగా దీనిపై బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఐపీఎల్లో మ్యాచ్ల సంఖ్య పెంచడం అనేది సాధ్యం కాదన్నారు. 74 మ్యాచ్ల ఫార్మాట్‌ను విస్తరించే ప్రణాళికలు ఇప్పుడు లేవనీ, వివిధ దేశాల నుంచి వచ్చే ఆటగాళ్లకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎంతో కష్టపడితేనే ఐపీఎల్ కోసం రెండు నెలల విండో దొరుకుతోందనీ గుర్తు చేశారు.