ప్రజలకు జవాబుదారీగా ఉండండి
మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి
దేవరకద్ర జులై 28: ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి జవాబుదారీగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. మంగళవారం దేవరకద్ర పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డి.జానకి, క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ప్రజలకు న్యాయం అందించే తొలి కేంద్రంగా ఉండాలని, ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతాయుతంగా స్వీకరించి చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖపై మరింత విశ్వాసం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల స్వభావం, పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసులు, వారెంట్ల అమలు, బీట్ వ్యవస్థ, నేరస్థుల కదలికలపై తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, ముందస్తు చర్యల ద్వారా నేరాలను నివారించే విధంగా పని చేయాలని ఆదేశించారు. సిబ్బందితో సమన్వయం పెంచుకుంటూ సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, దేవరకద్ర సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.






