05-02-2026 12:32:07 AM
నస్పూర్/బెల్లంపల్లి, ఫిబ్రవరి 4 : మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ కొరకు ఎంపిక చేసిన శారద ప్రింటింగ్ ప్రెస్‌ను కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించి ముద్రణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత గల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఎన్నికల గుర్తులు కేటాయించామని, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 240 మంది, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో 173 మంది, చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో 107 మంది, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 22 వార్డులలో 113 మంది, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో 60 మంది అభ్య ర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లోని పలు అభివృద్ధి పనులను బుధ వారం పరిశీలించారు. బెల్లంపల్లి పట్టణంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలంచి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు మండలంలోని టిజిఐఐసికి సంబందించిన భూమిని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మండల తహసిల్దార్ శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు.