అసభ్యంగా ప్రవర్తించాడని కొట్టి చంపారు
గుంపు మేస్త్రి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
నాగర్ కర్నూల్ మార్చి 4 (విజయక్రాంతి): బిజినపల్లి మండల పరిధిలో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
కొల్లాపూర్ గ్రామానికి చెందిన అన్నలదాసి శివశంకర్ ఫిర్యాదు మేరకు తమ్ముడు జగన్మోహన్ (32) హత్యకు గురైనట్లు కేసు నమోదు చేశారు. మృతుడు కూలీ పనులు చేసేవాడని, గుంపు మేస్త్రితో కలిసి బెంగళూరులో పనిచేసి, అప్పుడప్పుడు బిజినపల్లి పరిధిలోనూ కూలీలను తరలించేవాడని విచారణలో తెలిసింది.
మార్చి 1న రాత్రి గౌరారం గ్రామంలో పరశురాములు, నాగరాజు, జగన్మోహన్ కలిసి గ్రామంలో కల్లు సేవించిన అనంతరం నాగరాజు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో నాగరాజు భార్య పార్వతమ్మతో జగన్మోహన్ అసభ్యంగా ప్రవర్తించాడని అనంతరం గొడవ తలెత్తడంతో ముగ్గురు కలిసి జగన్మోహ్ప దాడి చేసి హతమార్చారని తెలిపారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వారితోపాటు సిఐ అశోక్ రెడ్డి ఉన్నారు.




