ఆమె ఎవరు?
- పార్టీల్లో మహిళలకు నాయకత్వం మాటలకే పరిమితం
- పదవుల్లో కనిపించని ప్రాధాన్యత నామమాత్రంగా మహిళా విభాగాలు
- అధ్యక్షురాళ్లకే లేని రాజకీయ గుర్తింపు
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి.. వీరికి లభించే ప్రాధాన్యత అంతంతమాత్రమే అని చెప్పాలి. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీకి గతంలో మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి కాగా ప్రస్తు తం ఆ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలే లేదు.
రాష్ట్రంలో మిగతా పార్టీల కు, మహిళా విభాగాలకు అధ్యక్షురాళ్లు ఉన్నప్పటికీ వారు రాజకీయంగా పొందుతున్న గుర్తింపు నామమాత్రమే!. పోరాటాల్లో, ఉద్యమాల్లో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న నాయకురాళ్లు తగిన ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారనేది వాస్తవం. ప్రస్తుతం రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాల్లో మహిళా నాయకత్వానికి దక్కుతున్న ప్రాధాన్యతను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.
పార్టీ కార్యక్రమాల్లో, ఆయా పార్టీలు అధికారంలోకి రావడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మహిళా నాయకత్వానికి మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదు. రాజకీయాల్లో మహిళా సాధికారత అంటూ పార్టీల పెద్దలు చెప్పేవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. సభల్లో, మేనిఫెస్టోలలో, ఎన్నికల హామీల్లో మహిళలకు సముచిత స్థానం ఇస్తామంటూ హామీలు ఇస్తారు కానీ పదవుల పంపకంలో మాత్రం మహిళల ప్రాధాన్యత లభించడంలేదు.
దేశవ్యాప్తంగా మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదించినా, వాస్తవ రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు ఇంకా అట్టడుగునే ఉంటున్నాయి. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో కీలక పదవులు ఎక్కువగా పురుషుల చేతుల్లోనే ఉండటం గమనార్హం.
విభాగం ఉంది.. కానీ అధికారమే లేదు..
ప్రతి పార్టీలో మహిళా విభాగం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాళ్లు, మండల స్థాయి కమిటీలు అన్నీ కాగితాలపై బలంగానే కనిపిస్తాయి. కానీ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరో లు, కోర్ కమిటీలు, టికెట్ కేటాయింపుల కమిటీల్లో మహిళల శాతం చాలా తక్కువగా ఉండటం వాస్తవం. ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక సమావేశాలు, సభలు, ప్రచార యాత్రలు నిర్వహించడంలో మహిళా విభాగాన్ని ముందుకు నెట్టి నా, నిర్ణయాత్మక పదవుల విషయానికి వస్తే మాత్రం వెనుకబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామ స్థాయిలో వార్డు సభ్యురాలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా అంచెలంచెలుగా ఎదిగిన మహిళా నేతలు ఉన్నారు. ఉద్యమాల్లో పాల్గొని, పార్టీ కోసం కష్టపడి, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపులో మాత్రం వారి పేరు చివరి జాబితాలోనూ కనిపించకపోవడం సాధారణమైందని వారు వాపోతున్నారు. పార్టీల్లో అంతర్గత లాబీయింగ్, ఆర్థిక వనరుల కొరత, కుటుంబ రాజకీయాల ప్రభా వం వంటి అంశాలు మహిళల ఎదుగుదలకు అడ్డంకులవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్ర స్థాయిలో కీలక మంత్రిత్వ శాఖలు, పార్టీ అధ్యక్ష పదవులు, వ్యూహాత్మక బాధ్యతలు ఎక్కువగా పురుషులకే దక్కుతున్నాయి. మహిళలకు సాధారణంగా మహిళా, శిశు సంక్షేమం, సామాజిక సంక్షేమం వంటి శాఖలకే పరిమితం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో మాత్రం మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు ప్రకటించడం, ఆర్థిక సాయం హామీలు ఇవ్వడం సాధారణంగా మారింది. కానీ నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల సంఖ్య పెరగకపోవడం విరుద్ధ సంకేతాలుగా కనిపిస్తోంది.
అన్ని పార్టీల్లోనూ అదే తీరు..
తెలంగాణ రాజకీయాల్లో మహిళా సాధికారతపై అన్ని ప్రధాన పార్టీలు గట్టిగా మాట్లాడుతున్నా, నిర్మాణాత్మకంగా మహిళలకు ప్రాధాన్యత మాత్రం దక్కడం లేదు. బీజేపీలో మహిళా మోర్చా బలంగా ఉన్నప్పటి కీ, రాష్ట్ర కోర్ కమిటీ, ఎన్నికల వ్యూహ కమిటీల్లో మహిళల శాతం తక్కువగా ఉన్నదన్న విమర్శ ఉంది. ఎన్నికల సమయంలో మహిళా అభ్యర్థులకు అవకాశా లు ఇచ్చినా, మొత్తం టికెట్లలో వారి శాతం పరిమితంగానే ఉంటుంది. కేంద్ర స్థాయిలో మహిళా మంత్రులు ఉన్నా, రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు పురుషుల చేతుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి.
ప్రచారంలో నారీ శక్తి నినాదం బలంగా వినిపించినా, నిర్మాణాత్మక శాతం పెంపు ఇంకా సవాలుగానే ఉంది. కాంగ్రెస్‌లో మహిళా కాంగ్రెస్ విభాగం చురుకుగా ఉన్నా, తుది నిర్ణయాల్లో మహిళా నాయకత్వం పరిమితమే అన్న అభిప్రాయం ఉంది. సాంప్రదాయంగా మహిళలకు కొంతమేర అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేసినా, గెలుపు సాధ్యాసాధ్యాల లెక్కల్లో మహిళల కంటే సేఫ్ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శ ఉంది. జాతీయ స్థాయిలో మహిళా నాయకత్వానికి వేదిక కల్పించిన పార్టీగా గుర్తింపు ఉన్నా, రాష్ట్ర స్థాయిలో సమాన ప్రాతినిధ్యం సాధ్యం కాలేదనే విశ్లేషణ ఉంది.
బీఆర్‌ఎస్‌లో ఉద్యమ దశలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా ఉన్నా, అధికార దశలో కీలక పదవుల్లో వారి సంఖ్య తగ్గిందనే విమర్శ ఉంది. మహిళలకు కార్పొరేషన్ చైర్ పర్సన్లు, నామినేటెడ్ పదవులు ఇచ్చి నా, నిర్ణయాత్మక మంత్రిత్వ శాఖలు పరిమితంగానే దక్కినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా సాధికారతపై అన్ని పార్టీలు నినాదాలు చేస్తున్నప్పటికీ, వాస్తవ అధికారం కల్పించడంలో సమానత్వం ఇంకా సాధ్యం కాలేదు.
మహిళా విభాగాలు ఉన్నా, నిర్ణయాత్మక సమయంలో మహిళల ప్రాతినిధ్యం పెరగకపోతే సాధికార త కేవలం ప్రచార వేదికలకే పరిమితమవుతుందనే అభిప్రాయం బలపడుతోంది. మహిళా సాధికారత నినాదమేనా? నిజమైన అధికార భాగస్వామ్యంగా మారుతుందా? అన్న ప్రశ్నలకు రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
మాటల్లోనే మహిళా సాధికారత..
రాజకీయ పార్టీల్లో మహిళా సాధికారతపై గొప్పగా ప్రకటనలు చేస్తుంటాయి. కానీ ఆచరణ లో మాత్రం మహిళా విభాగాలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలు రోజురో జుకీ పెరుగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో మహిళా విభాగానికి అధ్యక్షురాలు ఉన్నా, పార్టీ కీలక నిర్ణయాల్లో వారి పాత్ర పరిమితంగానే ఉండటం గమ నార్హం. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ చట్టం ఆమోదం పొందిన తర్వాత మహిళా నాయకత్వం పై ఆశలు పెరిగాయి.
అయితే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ అయినా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అయినా, రాష్ట్ర రాజకీ యాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బీఆర్‌ఎస్ అయినా మహిళా విభాగాలకు ఇస్తున్న ప్రాధాన్యం పరిమితమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలోని మోదీ సర్కార్ మహిళా శక్తి, నారీ శక్తి అంటూ అనేక వేదికల్లో ప్రస్తావించినా, రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్మాణాల్లో మహిళల ప్రాతినిధ్యం ఆశించిన స్థాయికి చేరలేదనే విమర్శలు ఉన్నాయి.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ కూడా మహి ళా హక్కులపై బహిరంగ సభల్లో గొంతెత్తినా, టిక్కె ట్ల కేటాయింపులో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటిలో నూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహిళా విభాగాలకు ప్రత్యేక కమిటీలు ఉన్నా, తుది నిర్ణయాల్లో వారి పాత్ర పరిమితంగానే ఉంటోందన్న భావన ఉంది.
మార్పు వస్తేనే..
మహిళా విభాగాలు ఎక్కువగా నిరసనలు, ధర్నాలు, జాగరణ కార్యక్రమాలకే పరిమితమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక విధానాల రూపకల్పనలో, అభ్యర్థుల ఎంపికలో, పార్టీ వ్యూహాల్లో మహిళా విభాగాల నుంచి వచ్చే సూచనలు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటున్నారన్నది ప్రశ్నార్థకమే. రాజకీ యాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే కేవలం చట్టాలు సరిపోవని, పార్టీల్లో అంతర్గత సంస్కరణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
టిక్కెట్ల కేటా యింపులోనూ, కీలక పదవుల్లోనూ మహిళలకు అవకాశాలు కల్పించడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు. మహిళా నాయకత్వానికి నిజమైన గుర్తింపు రావాలంటే టికెట్ కేటాయింపులో కనీస శాతం నిర్ధారణ, కోర్ కమిటీల్లో మహిళలకు స్థానం, ఆర్థిక, రాజకీయ శిక్షణా కార్యక్రమాలు, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్ట డం వంటి మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
మహిళా విభాగం పేరుతో నిర్మాణం ఉన్నా, అధికార కేంద్రీకరణ మాత్రం పురుషుల చేతుల్లోనే కొనసాగుతోందన్న వాస్తవం బయటపడుతోంది. అంచెలంచెలుగా ఎదిగిన మహిళల కు కూడా కీలక పదవులు అందని దూరంలోనే మిగిలిపోతున్నాయి.




