11 April, 2026 | 11:20 AM

బెల్లంపల్లి మార్కెట్ కుర్చీ ఎవరికో?

29-06-2024 12:05 AM
  • రిజర్వేషన్‌లో చైర్మన్ పీఠం మహిళలకే!
  • లాబీయింగ్ మొదలుపెట్టిన ఆశావహులు
  • ఎమ్మెల్యే వినోద్ వద్దకు చేరిన జాబితా

బెల్లంపల్లి, జూన్ 28 (విజయక్రాంతి): బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిపై అధికార పార్టీ నాయకులు పలువురు పోటీపడుతున్నారు. చైర్మన్ పదవి ఎస్సీ(మహిళ)కు కేటాయించడంతో ఆ వర్గానికి చెందిన నేతలు ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టారు. కాంగ్రెస్‌లో కీలక నాయకులు పలువురు తమ సతీమణులను అందలమెక్కించే ప్రయత్నాల్లో మునిగిపో యారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వద్ద పలువురు తమ కోరికను విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి మండలం కన్నాలకు చెందిన పీసీసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాథరి స్వామి సతీమణి పేరు ప్రధానంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా, పార్టీ కష్టకాలంలో కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగిన రాష్ట్ర ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్ జమ్మికుంట విజయ్ కూడా తన సతీమణి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  జమ్మికుంట విజయ్ తాత జమ్మికుంట కొమురయ్య 1974 అక్టోబర్ 1న జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి హోదా లో గాంధీభవన్‌లో నిర్వహించనున్న పార్టీ సమావేశానికి వెళ్తూ ఆదిలాబాద్ ఘాట్‌రోడ్‌లో జీపు బోల్తాపడి మృతి చెందారు. అతని తండ్రి జమ్మికుంట నాగేశ్వర్‌రావు నలభైఏళ్లుగా కాంగ్రెస్‌లో క్రియా శీలకంగా వ్యవహరించారు.  ఎమ్మెల్యే గడ్డం వినోద్ నేతృత్వంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తమ కుటుంబానికి దక్కుతుందన్న ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కార్యదర్శి రొడ్డ శారద, చాకేపల్లి ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్ సతీమణి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చిలుముల శంకర్ సతీమణి, నెన్నెల మండలానికి చెందిన మహిళా కార్యకర్త గోలేటి సంధ్య సైతం చైర్మన్‌గిరి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ వర్గీయులకు అవకాశం దక్కకపోవడచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తంగా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.