ముక్కలైన దేహానికి పాతికేళ్లు
అప్రకటిత నిర్బంధమున్న రోజుల్లో గాత్రమంతా గానమై తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వినిపించింది ఆమె. పేదరికం ప్రాథమిక విద్యకు దూరం చేసేనా.. కుటుంబ పోషణ కోసం కార్మికురాలిగా పని చేస్తూనే.. సమాజాన్ని నిశితంగా చదివి పేద ప్రజల సమస్యల పరిష్కారానికి పాటై పోటెత్తింది. న్యాయమైన అస్తిత్వ, సామాజిక, మలి తెలంగాణ ఉద్యమాల్లో డోలు దెబ్బ మోగించింది. పాటనే జీవితంగా మలుచుకొని చివరి శ్వాస వరకు ఉద్యమించింది తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత.
నిర్బంధంలోనూ ‘జై తెలంగాణ’ అంటూ నినదించిన బెల్లి లలిత 1972 ఏప్రిల్ 29న లక్ష్మమ్మ - చంద్రయ్య దంపతులకు భువనగిరిలో జన్మించింది. నిరుపేద కుటుంబం కావడంతో ప్రాథమిక విద్యకు సైతం నోచుకోలేదు. కుటుం బ పోషణ కోసం స్థానిక కాటన్ స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది. ఈ క్రమంలోనే సీఐటీయూలో సభ్యత్వం తీసుకొని కార్మిక హక్కుల సాధన కోసం పోరాడింది. అనంతరం ‘భువనగిరి సాహిత్య మిత్ర మండలి’లో చేరి.. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటను తన అస్త్రంగా మార్చుకుంది. ‘తాగబోతే నీళ్లు లేవూ తుమ్మెదాలో ! తడి గొంతూలారిపాయే తుమ్మెదాలో !!’ అంటూ ఫ్లోరైడ్ నీటి సమస్యలపై గళమెత్తింది. గుట్కాను మానండి.. గట్కను తినండి అంటూ.. యువతను చైతన్య పరించింది. పడుపు వృత్తి, సారా వ్యతిరేక ఉద్యమాలు నడిపింది. 1996లో తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట సాధనే లక్ష్యంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ‘తెలంగాణ ఐక్య వేదిక’ ఏర్పాటు చేశారు. మేధావులు, కవులు, కళాకారులను ఏకం చేసి భావజాల వ్యాప్తికి కషి చేశారు.
ఈ నేపథ్యంలో 1997 మార్చి8లో భువనగిరిలో జరిగిన ‘దగాపడ్డ తెలంగాణ’ సభలో బెల్లి లలిత కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 11 ఆగస్టు 1997 బహుజన నేత మారోజు వీరన్న సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మహాసభ’ తో పాటు 28 డిసెంబర్ 1997లో వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో లలిత తన గానంతో గర్జన చేసింది. పీపుల్స్ వార్ సానుభూతిపరులు ఏర్పాటు చేసిన ‘తెలంగాణ జనసభ’ అనుబంధ విభాగమైన ‘తెలంగాణ కళా సమితి ‘కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించి ఊరూరా తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు ఆవశ్యకతను ఆమె వివరించింది. తెలంగాణ రాష్ర్ట డిమాండ్ ఉధృతం అవుతుండటం ఆనాటి సమైక్య పాలకులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిపి.. బహుజన నేత మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్న వారు.. విశేష ఆదరణ పొందుతున్న బెల్లి లలితను టార్గెట్ చేశారనే ఆరోపణలు వినవచ్చాయి. 26 మే 1999న ఇంటి నుండి వెళ్ళిన లలిత తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో 29 మే 1999న దర్గాబావిలో శరీర భాగాలు ఉన్నాయన్న వార్తతో భువనగిరి ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
పెల్లుబికిన నిరసనతో.. పోలీసులు 13 రోజులు గాలించగా పలు బావులు, చెరువుల్లో 17 ముక్కలైన లలిత శరీర భాగాలు లభ్యమయ్యాయి. 11 జూన్ 1999లో జరిగిన అంత్యక్రియలకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. నాటి పాలకులే.. మాజీ నక్సలైట్ ను ఆయుధంగా మార్చుకొని లలితను అత్యంత పాశవికంగా హత్య చేయించారని ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు దుమ్మెత్తిపోశారు. లలిత మరణంతో భయపడిన పాలకులు ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు. పోరాటాన్ని గానం చేస్తూ.. ప్రాణ త్యాగం చేసిన లలిత బాటలో ఆ తర్వాత అనేక మంది కళాకారులు కదం తొక్కా రు. ప్రజా పోరాటాలు.. విద్యార్థుల వీరోచిత ప్రతి ఘటనతో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటైంది. ఆరు దశాబ్దాల ఆకాంక్ష కోసం 17 ముక్కలైన లలిత అమరత్వానికి స్వరాష్ర్టంలోనూ కనీస గౌరవం దక్కలేదు. రాజ్యహింసకు గురై ముగ్గురి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ కుటుంబాన్ని తొలిసారి అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ పాలకులు సైతం పట్టించుకోలేదు. ప్రజా పాలనగా చెప్పుకుంటున్న ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం లలిత విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు, భువనగిరిలో స్మారక భవనంతో పాటు జయంతి, వర్ధంతిని అధికారికంగా జరిపి తమ నిబద్ధతను చాటుకోవాలని కుటుంబ సభ్యులు, ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నారు.
పి. నరేష్,
సెల్ : 9505475431






