రేవ్ పార్టీ రచ్చ
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఇంకా చల్లారక ముందే బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో వందమందికి పైగా పట్టుబడిన సంఘటన రెండు రాష్ట్రాలు ఉలిక్కి పడేలా చేసింది. బర్త్‌డే పార్టీ ముసుగులో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో పట్లుబడిన వారంతా కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలే కావడం గమనార్హం. దాదాపు 30 మంది మహిళలు కూడా పట్టుబడిన వారిలో ఉండడంగమనర్హం. టాలీవుడ్ నటి హేమ తో పాటుగా పలువురు స్టార్లు కూడా ఉన్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. తాను రేవ్‌పార్టీలో లేనని హేమ వీడియో రిలీజ్ చేయడం, ఆమె పార్టీలోనే ఉన్నట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించడంతోఆమె అడ్డంగా దొరికి పోయారు. హేమతో పాటుగా మొత్తం86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుబ్లడ్ శాంపిల్స్ పరీక్షల్లో తేలిందని కూడా పోలీసులు చెప్పారు.
అయితే రేవ్ పార్టీ జరిగిన ఫామ్‌హౌస్ హైదరాబాద్‌కు చెందిన కాంకార్డ్ సంస్థ యజమాని గోపాలరెడ్డికి చెందినదని తెలుస్తోంది. కాగా పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తి ఏపీలోని విజయవాడకు చెందిన లంకలపల్లి వాసు అని, ఇతను పైకి రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలు చేస్తున్నా అసలు దందా మాత్రం బెట్టింగ్‌అని, దీనిలో కోట్లు సంపాదించాడని చెప్తున్నారు. అతనితో పాటుగా పార్టీలో డ్రగ్‌స సప్లు చేసిన మరోనలుగురిని కూడా పోలీసులు అప్పట్లోనే అరెస్టు చేశారు. అయితే ఈ రేవ్ పార్టీ ఏపీలో రాజకీయ సంచలనానికి కూడా కారణమయింది. పార్టీలో పట్టుబడిన లగ్జరీ కార్లలో ఒకదానిలో రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌కు చెందిన ఎంఎల్‌ఎ స్టిక్కర్ దొరడంతో రాజకీయ దుమారం మొదలైంది. రేవ్‌పార్టీతో అధికార వైసీపీ నేతలకు సంబంధాలున్నాయంటూ విమర్శలు మొదలైనాయి. అయితే తన పేరుతో ఉన్న స్టిక్కర్ దొరకడంపై మంత్రి వివరణ ఇవ్వడం జరిగింది.
ఈలోగా స్టిక్కర్ వాడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పట్టుబడిన నిందితులకు అధికార వైసీపీతో సంబంధాలు న్నాయన్న ఆరోపణలు మొదలయ్యాయి. మరో వైపు రేవ్ పార్టీ విషయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు లను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే ఇంత పెద్ద పార్టీ జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్లు ఫిర్యా దు చేసే దాకా పోలీసులకు సమాచారం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కనుసన్నల్లోనే రేవ్ పార్టీ జరిగి ఉండవచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. కోట్లు ఖర్చు చేసి రాత్రి అంతా భారీ ఎత్తున పార్టీ నిర్వహిస్తూ ఉంటే పోలీసులకు తెలియదని చెప్పడాన్ని ఎవరూ నమ్మలేరు. ఫామ్ హౌస్‌ల సంస్కృతి పెరిగి పోవడం, నగరాలకు దూరంగా ఉండే ఈ ఫామ్‌హౌస్‌లలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై పెద్దగా నిఘా లేకపోవడంతో రేవ్ పార్టీలాంటివి పెరిగిపోయాయి. పైగా ఇలాంటి పార్ట్టీలు నిర్వహించే వారు, పాల్గొనే వాళ్లు అంతా బడాబాబులే కావడంతో పోలీసులు చూసీ చూడకుండా ఉంటున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.
ఈ రేవ్ పార్టీల్లో డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా వాడడం మామూలై పోయింది. గతంలో హైదరాబాద్ శివార్లలో కూడా ఇలాంటి పార్టీల్లో పలువురు పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆ కేసులు ఏమయ్యాయో తెలియదు. ముంబయిలో ఓ షిప్‌లో జరిగిన భారీ పార్టీ వ్యవహారమే నీరుగారిపోయినప్పుడు ఇలాంటి వాటి విషయం చెప్పనవసరం లేదు. అయితే పోలీ సులు ఏవో ప్రయోజనాలు ఆశించి ఇలాంటి విష సంస్కృతిని పెంచి పోషిస్తే చివరికి అది సమాజానికి రాచ పుండుగా మారుతుంది. పోలీసు వ్యవస్థకు సైతం చెడ్డపేరు వస్తుంది. కనుక ఇలాంటి కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తేనే పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ పెరుగుతుంది. కాగా బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కర్నాటక పోలీసులు ఫామ్‌హౌస్ యజమానితో పాటుగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధ్ధారణ అయిన అందరికీ ఈ నెల 27న విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులు జారీ చేశారు. ఆ విచారణ తర్వాత మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.






