30 March, 2026 | 3:29 AM

నీటిపారుదల శాఖలో బినామీ ఉద్యోగులు

30-03-2026 01:47 AM
  1. భార్యల పేరిట భర్తలు, తండ్రి పేరుట కుమారులు, మరో కొందరు బినామీలు 

ఉన్నత అధికారుల ఇళ్లలో బినామీల ఊడిగం 

కరీంనగర్: మార్చి 29(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తో పాటు కరీంనగర్ జిల్లాలో నీటిపారుదల శాఖలో బినామీలు అసలు ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగం రాక ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు. కానీ ఉద్యోగం వచ్చినవారు వారు  ఉద్యోగం చేయలేక పోవడంతో వారి పేరిట బినామీలు ఉద్యోగం చేస్తున్నారు. ఉన్నతాధికారుల సైతం వారిని అఫీషియల్ గా ఉద్యోగులుగా గుర్తించి  ఉద్యోగం చేయించుకుం టున్నారు.

నీటి పారుదల శాఖలో లష్కర్ లు గా కొనసాగుతున్నారు. వీరికి ప్రభుత్వం వేతనం రూ, 25 వేలకు పైగా చెల్లిస్తుంది. అయితే మీరు పని చేయకుండా వీరి పేరిట వేరే వాళ్ళు బినామీలుగా పనిచేస్తున్నారు. ఆ శాఖ రికార్డుల్లో అసలు దారులు ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో వారి భర్తలు కుమారులు, సమీప బంధువులు, మరో కొందరైతే ఏకంగా బినామీలే పనిచేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లికి చెందిన దేవరాజు పేరిట బోయినపల్లి మండలం చెందిన వ్యక్తి  బినామీ ఉద్యోగి గా, అదేవిధంగా చందుర్తి మండలం నుండి ఆశరెడ్డి పల్లికి చెందిన ఒక వ్యక్తి పేరిట మరొకరు పనిచేస్తున్నారు.

అదేవిధంగా కొనరావుపేట నుంచి ఒక వ్యక్తి పని చేయగా ఆయన పేరిట కూడా మరొకరు పనిచేస్తున్నారు. కామారెడ్డి నుంచి గంగాధర సబ్ డివిజన్ కు ఒక లస్కర్ బదిలీ కాగా ఆయన పేట బోయినపల్లిలో నివాసం ఉంటూ మరొకరు పనిచేస్తున్నారు. ఈ విధంగా గినామి ఉద్యోగులు పనిచేస్తుండగా, గంగాధర వేములవాడ మరో కొన్ని సబ్ డివిజన్లో భార్యల పేరిట భర్తలు, తండ్రి పేరుట కుమారులు, బంధువుల పేట సమీప బంధువులు పనిచేస్తున్నారు.

అసలు దారులకు వచ్చే వేతనంలో 70% బినామీలు తీసుకుంటూ, మరో కొంత వారిని ఒప్పుకున్న ఉద్యోగులు నెల నెల ముడుపుల రూపంలో తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇ దంద గత కొన్ని ఏళ్ళు గా కొనసాగుతుంది. ఈ బినామీ ఉద్యోగుల దందా ఉన్నతాధికారుల కనుసన్నల్లో మూడు పువ్వులు ఆరు కాయలు గా చక్కగా కొనసాగుతుంది. 

సమీప బంధువుల ఇళ్లలో ప్రభుత్వ కార్యాలయం 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అనుపురం ఆర్ అండ్ ఆర్ కాలనీ లో నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో పరిపాలన సౌలభ్యం కోసం కరీంనగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు  మూడు నాలుగు మండలాలను కలిపి ఒక్కొక్క సబ్ డివిజన్ గా ప్రభుత్వం గుర్తించి డివిజన్ సబ్ డివిజన్లను ఏర్పాటు చేసింది.

ఈ తరుణంలో సరిపడా ప్రభుత్వ కార్యాలయాలు లేకపోవడంతో డివిజన్ సబ్ డివిజన్ల కార్యాలయాలు అద్దె ఇళ్లలో కొనసాగాయి. ఈ బినామీ ఉద్యోగుల దందాను రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా కలెక్టర్లు దృష్టి సారిస్తేనే అ దందా కు చెక్ పడుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.