30 March, 2026 | 4:16 AM

వంట.. తప్పని తంట

30-03-2026 02:11 AM

గ్యాస్ లేక వంట గాక మహిళలది ఒడువని వ్యధ

యుద్ధప్రభావంతో మారిన స్థితి 

బ్లాక్‌మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్ రూ.1500 పైనే..!

కమర్షియల్ సిలిండర్ కైతే రూ.3 లేదా 4 వేలు!

పాతకాలం పద్ధతులతో ఉడుకుతున్న వంటలు

అధికారుల తనిఖీల్లో బయట పడుతున్న అక్రమ నిల్వలు

హుజూర్ నగర్, మార్చి 29 : 30 ఏళ్ల క్రితం వరకు దాదాపుగా అన్ని ఊళ్లో కట్టెల పొయ్యి, ఊక పొయ్యి, కిరోసిన్ స్టౌ, బొగ్గుల కుంపటి మాత్రమే ఉండేవి. కాలక్రమేణా సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుని గ్యాస్ స్టౌలు వచ్చాయి. దీంతో ఎన్నో కష్టాల నుంచి విముక్తి వచ్చిందని, ముఖ్యంగా వంట చేసే మహిళలు ఎన్నో రోగాల నుంచి బయటపడ్డారు. వంట త్వరగా పూర్తవుతోంది.కానీ ఇప్పుడు మళ్లీ అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నాం. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ ప్రభావంతో దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది.

ఎల్పీజీ ఉత్పత్తి కోసం భారతదేశం కువైట్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్, శుద్ధి చేసిన ముడి చమురు ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడి ఉంది. యుద్ధ సంఘర్షణల కారణంగా ప్రస్తుతం దిగుమతులపై ఆంక్షలు ఉండటంతో, వంటగ్యాస్ లభ్యత తీవ్రంగా తగ్గిపోయింది. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అంతరాయం కలగదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపు తగ్గిపోయింది. హోటళ్ల వ్యాపారులు వారంలో రెండు రోజులు మూసి వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్లు మూసివేయక తప్పదని పలువురు హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. 

గ్యాస్ కోసం తప్పని తిప్పలు..

జిల్లాలోని పలు ప్రధానమైన పట్టణాలు హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నేరేడుచర్ల, ప్రాంతాలలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు మరియు టీస్టాళ్లు వాణిజ్య, ఎల్పీజీ సిలిండర్లను సేకరించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇజ్రాయిల్ అమెరికా,ఇరాన్ యుద్ధంతో గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వంట గ్యాస్ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పౌరసరఫరాల అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో గ్యాస్ అక్రమ నిల్వలు పెద్దఎత్తున బయటపడుతున్నాయి.దీనిని ఆసరాగా చేసుకొని వినియోగదారులకు అందజేయాల్సిన గ్యాస్ ను పెద్దఎత్తున పక్కదారి పట్టిస్తున్నారు.               

జిల్లాలో 4 లక్షల పైనే కలెక్షన్లు..

సూర్యాపేట జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 4 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని సమాచారం. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడడంతో దీనిని ఆసరాగా చేసుకొని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ బ్లాక్ దందాకు తెరలేపారని గ్యాస్ వినియోగదారులు అగ్రహ వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుడు గ్యాస్ బుక్ చేసుకుంటే గతంలో 3 రోజుల వ్యవధిలోనే ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్ ను డెలవరీ చేసేవారని,నేడు గ్యాస్ బుకింగ్ చేసుకుంటే 10 రోజుల నుండి 15 రోజులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.                    

అధిక ధరకు అమ్మకాలు..

ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా ఎక్కువ ధరలకు గ్యాస్ ను అమ్ముతూ ఏజెన్సీ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.దీంతో అధికారులు గ్యాస్ కృత్రిమ కొరతను నివారించేందుకు పట్టణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.దీంతో పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు పెద్దఎత్తున బయట పడుతున్నాయి.గ్యాస్ కృత్రిమ కొరతతో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ ధర అమాంతం పెరిగాయి.

డొమెస్టిక్ సిలిండర్ బ్లాక్ మార్కెట్లో రూ.1500 నుండి రూ.1800 వరకు అమ్ముతుండగా, కమర్షియల్ సిలిండర్ ను రూ.3వేల నుండి రూ.4వేల వరకు డిమాండ్ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అదునుగా భావించి కొంతమంది గృహవినియోగదారులు కూడా వారి వద్ద నిల్వ ఉన్న గ్యాస్ ను అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసు కుంటున్నారనీ విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా పట్టణ ప్రాంత గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులే కాకుండా గ్రామీణ ప్రాంతాలలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తమ వద్ద ఉన్న గ్యాస్ ను గుట్టుచప్పుడు కాకుండా అడ్డదారుల్లో పట్టణాలకు తరలించి పలు హోటల్ యజమానులకు అధిక ధరలకు అమ్ముతున్నారని అధికారుల దాడుల్లోను ఇదే విషయం బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం.

గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు

గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాలతో గ్యాస్ బ్లాక్ దందాపై గట్టి నిఘా ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా దాడులు చేసి సిలిండర్లను పెద్దఎత్తున సీజ్ చేస్తున్నాం. జిల్లాలో గ్యాస్ కొరత లేదు. వినియోగదారుల గ్యాస్ కొరత ఉందంటూ వచ్చే వదంతులను నమ్మవద్దు.

మోహన్ బాబు, సూర్యాపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి