పత్తి చేను నుంచి ఫ్యాషన్ రంగానికి!
ఎల్లబోయిన వెంకటేశ్వర్లు :
తెలంగాణను 2047 నాటికి దక్షిణా సియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కేవలం ఒక అభివృద్ధి నినాదం మాత్రమే కాదు, సమగ్ర ఆర్థిక మార్పుకు దారితీసే వ్యూహాత్మక దిశ. హైదరాబాద్‌లో జరిగిన ATEXCON-2026 వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ రాష్ట్ర భవిష్యత్ పారిశ్రామిక రూపురేఖలను స్పష్టం గా సూచించింది. ముఖ్యంగా పత్తి రైతు నుంచి గ్లోబల్ ఫ్యాషన్ మార్కెట్ వరకు ఒక సమగ్ర విలువ గొలుసును నిర్మించాలన్న ఆలోచన, తెలంగాణ అభివృద్ధి కథనంలో కీలక అధ్యాయంగా నిలవబోతోంది.
తెలంగాణకు వస్త్ర రంగం కొత్తది కాదు. ఈ నేల చేనేతకు, నేతకళకు, రంగుల సంప్రదాయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట నేత.. ఇవి కేవలం ఉత్పత్తులు మాత్రమే కాదు, తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు. ఈ వార సత్వాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయగలిగితేనే ప్రపంచ మార్కెట్ లో స్థిరమైన స్థానం సాధ్యం. అందుకే టెక్స్‌టైల్‌పై తెలంగాణ డీఎన్‌ఏలో ఉన్నాయి అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్య ఒక వాస్తవా న్ని ప్రతిబింబిస్తుంది.
అయితే, ఇప్పటి వరకు తెలంగాణ పత్తి ఎక్కువగా ముడి పదార్థంగా మాత్రమే మార్కెట్‌కు వెళ్తోంది. విలువ పెంచే ప్రాసెసింగ్, డిజైనింగ్, బ్రాం డింగ్ వంటి దశల్లో రాష్ట్రం ఇంకా పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేదు. ఈ లోటును భర్తీ చేయడమే ‘ఫార్మ్ టు ఫ్యాష న్’ అనే నినాదం వెనుక ఉన్న అసలు ఉద్దే శ్యం. రైతు పండించిన పత్తి అంతర్జాతీయ బ్రాండ్‌గా మారే వరకు రాష్ట్రంలోనే ప్రాసె స్ అయితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అది విప్లవాత్మక మార్పును తీసుకురాగలదు.
కొత్త ఆర్థిక అవకాశాల ద్వారం
ఈ నేపథ్యంలో వరంగల్‌లో అభివృద్ధి చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కేంద్ర సహకారంతో ఏర్పాటు చేస్తున్న ‘పీఎం మిత్రా పార్క్’ వంటి ప్రాజెక్టులు కీలక మైలురాళ్లు. ఫైబర్ నుంచి ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ నుంచి ఫ్యాషన్ వరకు ఒకే ప్రదేశంలో సమగ్ర ఉత్పత్తి సదుపాయాలు కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాదు, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా సృష్టించవ చ్చు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలకు ఇది కొత్త ఆర్థిక అవకాశాల ద్వారం తెరుస్తుంది.
అయితే, టెక్స్‌టైల్ హబ్‌గా ఎదగాలంటే కేవలం పార్కులు ఏర్పాటు చేయడం సరిపోదు. ముడి పదార్థం, విద్యుత్, నీరు, రవాణా వంటి మౌలిక సదుపాయాలతో పాటు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీ కూడా అత్యంత అవసరం. డిజైనింగ్, కట్టింగ్, స్టిచింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి నైపు ణ్యంతో తయారు చేయాలి. అదే సమయంలో సంప్రదాయ నేతకళను కాపాడుతూ ఆధునికీకరించడం కూడా ప్రభుత్వ బాధ్యత.
గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దే దిశగా..
ఇంకా ఒక ముఖ్యమైన అంశం బ్రాం డింగ్. పోచంపల్లి, గద్వాల వంటి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ ఉన్నప్పటికీ, అంతర్జాతీ య మార్కెట్‌లో వాటి పూర్తి సామర్థ్యం వినియోగించబడటం లేదు. ‘మేడ్ ఇన్ తెలంగాణ’ అనే గుర్తింపును ఒక గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహం అవసరం. ఇందుకోసం అంతర్జాతీయ ఫ్యాషన్ షోలు, డిజైనర్ కొలాబరేషన్లు, ఈ- ప్లాట్ ఫామ్స్ వంటి మార్గాలను సమర్థంగా వినియోగించాలి. ఇక్కడ హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేక అవకాశాన్ని కూడా విస్మరించలేం.
ఇప్పటి కే ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఈ నగరం ఇప్పుడు ‘గ్లోబల్ సినిమా హబ్’గా కూడా ఎదుగుతోం ది. అంతర్జాతీయ స్టూడియోలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విస్తరణతో సినిమాల్లో ఉపయోగించే కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ డిజైన్ రంగాల్లో తెలంగాణకు కొత్త మార్కెట్ ఏర్పడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ‘తెలంగాణ వస్త్రం’ అనే లక్ష్యం సాధ్యం కావచ్చు.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మరో ధోరణి గ్రీన్ టెక్స్‌టైల్స్. పర్యావరణానికి హాని కలిగించని సహజ రంగులు, నీటి వినియోగ నియంత్రణ, వ్యర్థాల పునర్వినియోగం వంటి అంశాల్లో తెలంగాణ ముందంజలో ఉంటేనే అంతర్జాతీయ మార్కెట్‌లో దీర్ఘకాలిక స్థానం సాధ్యం. ముఖ్యమంత్రి ప్రస్తావించిన గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌ల ఆలోచన ఈ దిశగా సరై న అడుగు. అయితే, దీన్ని అమలు చేయడానికి పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం అవసరం.
సమన్వయంతో ముందుకు సాగాలి
ఇంకా ఒక కీలక అంశం చేనేత కార్మికుల సంక్షేమం. పెద్ద పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నప్పటికీ సంప్రదాయ నేతన్న ల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోతే అభివృద్ధి అసంపూర్ణంగానే మిగులుతుంది. కనుక మార్కెట్ యాక్సెస్, న్యాయమైన ధరలు, డిజిటల్ మార్కెటింగ్ సదుపాయాలు, సామాజిక భద్రతా పథకాలు వంటి అంశా ల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. చేనేత కార్మికుడు బలపడితేనే టెక్స్‌టైల్ రంగం బలపడుతుంది.
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న తెలంగాణ లక్ష్యంలో టెక్స్‌టైల్ రంగం కీలక పాత్ర పోషించనుంది. అయితే ఈ లక్ష్యం సాధ్యమవ్వాలంటే ప్రభుత్వ విధానాలతో పాటు పారిశ్రామికవేత్తల చురుకుద నం, విద్యాసంస్థల భాగస్వామ్యం, పరిశోధనాభివృద్ధి, అంతర్జాతీయ మార్కెటింగ్.. ఇలా అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలి. అదే సమయంలో సంప్రదాయాన్ని కాపాడుతూ ఆధునికతను స్వీకరించే సమతుల్యత అవసరం.
‘పత్తి చేను నుంచి ప్రపంచ ఫ్యాషన్ రంగానికి’ అనే లక్ష్యం సాధ్యమే. కానీ, అది ఒకరోజులో సాధ్యమయ్యే పని కాదు. దీర్ఘకాలిక ప్రణాళిక, సమగ్ర అమలు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ కల నిజమవుతుంది. తెలంగాణలో తయారైన వస్త్రాన్ని ప్రపంచమంతా ధరించే రోజు వచ్చినప్పుడే ఈ విజన్ పూర్తి సార్థకమవుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు అది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి, శ్రమ, సృజనాత్మకత ప్రపంచ వేదికపై మెరిసిన ఘనమైన విజయం అవుతుంది.
వ్యాసకర్త సెల్: 81849 40814




