30-05-2025 12:00:00 AM
గద్దర్ సినీ అవార్డుల ప్రకటన
‘గద్దర్ తెలంగాణ చలనచిత్ర పురస్కారాలు-2024’ వెలువ డ్డాయి. గురువారం జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ అవార్డుకు ఎంపికైన సినిమాలను ప్రకటించారు. మొత్తం 1,248 నామినేషన్లు రాగా అన్నింటినీ పరిశీలించి మొత్తం 11 కేటగిరీల్లో అవార్డులను ఇవ్వనున్నారు. ఉత్తమ చిత్రంగా ‘కల్కి 2898ఏడీ’, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 చిన్న కథ కాదు), ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి) ఎంపికయ్యారు. కొందరు ప్రముఖుల పేర్లతోనూ ప్రత్యేక జ్యూరీ పురస్కారాలను ప్రకటించారు. ఈ పురస్కా రాలను జూన్ 14న ప్రదానం చేయనున్నట్టు ప్రకటించిన కమిటీ అవార్డుల జాబితాను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసింది.
స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సినిమా రంగానికి ప్రోత్సాహకంగా ఇవ్వాల్సిన అవార్డులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో 2014 నుంచి 2024 వరకు సినీ అవార్డులను ‘గద్దర్ తెలంగాణ చలనచిత్ర పురస్కారాలు’ పేరిట ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 14 ఏళ్ల తర్వాత చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ పురస్కారాల కోసం ప్రత్యేక కమిటీ వేసిన విషయం విదితమే. గురువారం హైదరాబాద్‌లోని సమాచార భవన్‌లో ఏర్పాటుచేసిన పాత్రికే యుల సమావేశంలో జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ, టీజీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజులు అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులకు మొత్తం 1248 నామినేషన్లు రాగా 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీ వాటన్నిటినీ పరిశీలించి మొత్తం 11 క్యాటగిరీల్లో అవార్డులను ప్రకటించింది.
ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ (పుష్ప2) ఎంపిక కాగా, ఉత్తమ చిత్రంగా ‘కల్కి 2898ఏడీ’, ఉత్తమ రెండో చిత్రంగా ‘పొట్టేల్’, ఉత్తమ మూడో చిత్రంగా ‘లక్కీ భాస్కర్’ సినిమాలు ఎంపికయ్యాయి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)తోపాటు ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా మొత్తం 21 మంది స్పెషల్ జ్యూరీ అవార్డులను ప్రకటించారు.
వీటితోపాటు ఎన్టీఆర్, కాంతారావు, పైడి జయరాజ్, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక జ్యూరీ పురస్కారాలను ప్రకటించారు. ప్రకటించిన ఈ పురస్కారాలను జూన్ 14న హెచ్‌ఐసీసీ వేదికగా వారికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమాలకు మాత్రమే అవార్డులు ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు సంబంధించి అవార్డులను తర్వాత ప్రకటించనున్నారు.
అద్భుత సంప్రదాయాన్ని పునరుద్ధరించడం గొప్ప ప్రోత్సాహకరం: చిరంజీవి
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఎంతో విలువైనది. సృజనాత్మక రంగంలోని ప్రతి నటుడు, టెక్నీషియన్‌కు ఎంతో ప్రేరణనిస్తుంది. అద్భుతమైన సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించడం, ఎంతో గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రులు, అధికారులు, అవార్డుల కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
అవార్డు గౌరవంగా భావిస్తున్నా: అల్లు అర్జున్
తొలిసారిగా ప్రవేశపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో పుష్ప-2 చిత్రానికి గాను నేను ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నన్ను ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్‌కు, నా నిర్మాతకు, పుష్ప టీమ్‌కే చెందుతుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నన్ను ప్రేమిస్తూ, నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తూ, నన్ను ఎల్లప్పుడూ ఎంతో ఇన్‌స్పైర్ చేసే నా అభిమానులకు అంకితం చేస్తున్నా.
ఈ అవార్డు అర్థవంతమైన కథలకు స్ఫూర్తి: యదు వంశీ
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డెరెక్టర్‌గా నేను గద్దర్ ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సినిమా రంగంలో యువ, నూతన ప్రతిభను ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డులు నిస్సందేహంగా చాలా మంది యువ నటులు, చిత్రనిర్మాతలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
నాకు, నా బృందానికి ఈ గౌరవాన్ని అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జయసుధ, జ్యూరీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గుర్తింపు మాకు చాలా ప్రేరణనిస్తుంది. ఇంకా అర్థవంతమైన కథలను చెబుతూనే ఉండటానికి స్ఫూర్తినిస్తుంది. మిగతా విజేతలందరికీ మరోసారి అభినందనలు.