మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి!
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రత్యేకంగా నగదు రహిత ఆరోగ్య భీమా పథకం ప్రవేశపెట్టడం సంతోషకరమైన అంశం. దీనివల్ల దాదాపు 8 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. ఇదే రీతిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని కొన్నేళ్లుగా కోరుతూ వస్తున్నాము. ప్రస్తుతం రూ. 40వేల చెల్లింపుతో జీవితాంతం భార్యాభర్తలు ఇరువురికి కలిపి 8 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే కొన్ని దీర్ఘకాల వ్యాధులకు ఉచితంగానే వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. సింగరేణి దవాఖానాల్లో ఉచితంగా అవుట్ పేషంట్ వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చులకు తోడు కొత్తగా పుట్టుకొస్తున్న రోగాలకు సరైన వైద్యం లేక అల్లాడిపోతున్నారు.
సరిపోని పెన్షన్‌లతో వయోభారం, రోగాలకు సరైన చికిత్స చేయించుకోలేక కష్టంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులకు అనేకసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లోనూ విజ్ఞప్తి పత్రాలు అందజేశాము. గత శాసనసభ సమావేశాల్లో రాంగుండం, మానకొండూరు ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఫలితం మాత్రం శూన్యం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సింగరేణి అధికంగా నిధులు సమకూరుస్తున్నప్పటికీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం పట్ల మాత్రం దృష్టి సారించడం లేదు.
సింగరేణి లాభాలకు పునాదులు వేసిన రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు సత్వరమే చేపట్టాలి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తారని చాలా మంది ఆశతో ఎదురుచూసి ఫలాలు అందకుండానే కనుమరుగవుతున్నారు. ప్రకృతికి విరుద్ధంగా గాలి, వెలుతురు లేని చోట విధులు నిర్వహించినప్పటికీ మా కష్టాన్ని గుర్తించడం లేదు. కోల్ ఇండియాతో సంబంధం లేకుండా సింగరేణి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.
దండంరాజు రాంచందర్, హైదరాబాద్




