26 June, 2026 | 2:49 AM

మెరుగైన వైద్య సేవలు అందించాలి

26-06-2026 01:32 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

లక్షెట్టిపేట, జూన్ 25: ప్రజా ఆరోగ్యం దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.

గురువారం లక్షెట్టిపేట 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, ల్యాబ్, పరిసరాలను పరిశీలించి అధిక శాతం నమోదు అవుతున్న వ్యాధులు, అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య రంగ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను ఆధునికరిస్తూ, ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం కే జీ బీ వీ సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులకు కార్యక్రమం నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయడం, తిరిగి సేకరించడం, వివరాల నమోదు అంశాలలో జాగ్రత్త వహించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించి తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.