ట్రాఫిక్ నియంత్రణలో ఎన్‌ఎస్‌ఎస్ సేవలు
- శిక్షణ తరగతులను ప్రారంభించిన డీజీపీ రవిగుప్తా
- పాల్గొన్న సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి ఎన్‌ఎస్‌ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) సహకారం అందించనుంది. దీని కోసం నగరంలోని వివిధ స్కూళ్లు, కాలేజీల్లో చదివే 30 వేల పైచిలుకు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించ నున్నారు. అనంతరం కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి మార్గదర్శకం చేయనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో డీజీపీ రవిగుప్తా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరయ్యారు.
కిండర్ గార్డెన్ వయసు నుంచే ట్రాఫిక్‌పై అవగాహన..
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమా దాలకు కారణమవుతున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి శిక్షలు విధిస్తున్నా అనుకున్న రీతిలో మార్పు రావడం లేదన్నారు. జపాన్ వంటి దేశాల్లో కిండర్ గార్డెన్ వయసు నుంచే దేశంలోని చట్టాలు, ట్రాఫిక్ తదితర వాటిపై అవగాహన కల్పిస్తుంటారని, కేరళ రాష్ట్రంలో కూడా ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తారని తెలిపారు.
అతి త్వరలో హైదరాబాద్‌లో కూడా ప్రతి పౌరుడు, వాహన దారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నగరంలో కొంతమంది యువకులు రోడ్లపై ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌కు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ట్రాఫిక్ పోలీసులకు సహాయం అందించి త్వరలోనే నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. శిక్షణ తీసుకున్న ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు వారి కాలేజీల్లోని విద్యార్థులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వలంటీర్ డ్రెస్, బ్యాడ్జ్, టోపీలను అందజేశారు.






