దొంగలున్నారు జాగ్రత్త!
- రైళ్లలో పెరుగుతున్న చోరీలు
ప్రయాణికులను బెదిరించి లూటీ చేస్తున్న ముఠాలు
ప్రతిరోజు పదుల సంఖ్యలో సెల్‌ఫోన్లు అపహరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): రైలు ప్రయాణాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు ప్రయాణికులకు మాయమాటలు చెప్పి మత్తు పదార్థాలు కలిపిన పదార్థాలు తినిపించి దోచుకున్న దొంగలు, ప్రస్తుతం రైలు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి ప్రయాణికులకు దోచుకుంటున్నారు. సుదూర మార్గాల్లో ప్రయాణించే రైళ్లతో సహా హైదరాబాద్ నగరంలో తిరిగే ఎంఎంటీఎస్ రైళ్ల వరకు దేనిని వదలడం లేదు. చోరీలకు అలవాటు పడిన ముఠాలు ఏ మాత్రం అదరకుండా, బెదరకుండా ప్రయాణికుల నుంచి అందినంత దోచుకొని పరారవుతున్నారు. ప్రస్తుతం రైళ్లలో జరుగుతున్న వరుస చోరీలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక నిద్ర లేని ప్రయాణాలు చేస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కాగా, రైళ్లలో దొంగతనాలకు అరికట్టడానికి ఆర్‌పీఎఫ్ పోలీసులు నిరంతరంగా కష్టపడుతున్నారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చోరీలకు పాల్పడిన వారిని కటకటాల్లోకి నెడుతున్నామన్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికులు కూడా ప్రయాణ సమయంలో బంగారం, నగదు వంటివి జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచిస్తున్నారు.
ముఠాలుగా ఏర్పడి.. కత్తులతో బెదిరించి
చోరీలకు అలవాటుపడిన కొందరు ముఠాలుగా ఏర్పడి రైళ్లలో ఒంటరిగా ప్రయాణించేవారిని టార్గెట్ చేసుకొని అదును చూసుకొని వారిని కత్తులతో బెదిరించి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎవరైనా అడ్డొస్తే వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడట్లేదు. ఇక రైలు ప్రయాణాల్లో జరిగే సెల్‌ఫోన్ చోరీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యల్లో సెల్‌ఫోన్లు చోరీ అవడం గమనార్హం. రైళ్లలోనే కాకుండా రైల్వే స్టేషన్లలోనూ దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. రద్దీగా ఉండే ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకొని తమ పని కానిచ్చేస్తున్నారు.
అక్రమ రవాణాకు రైలు మార్గం..
రోడ్డు మార్గంలో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్రమ రవాణాకు రైలు ప్రయాణాలను ఎంచుకుం టున్నారు కొందరు నేరగాళ్లు. ఒక్క మే నెలలోనే ఆర్‌పీఎఫ్ పోలీసులు రైళ్లలో రూ. 38 లక్షల విలువైన గంజాయిని పట్టుకొని 8 మందిని అరెస్టు చేశారు. అలాగే అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 3.9 లక్షల మద్యాన్ని సీజ్ చేసి 11 మందిని అరెస్టు చేశారంటే రైళ్లలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మధ్యన చోటుచేసుకున్న సంఘటనలు..
- తిరుపతి నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 12న అర్ధరా త్రి సమయంలో దోపిడీ దొం గలు రెచ్చిపోయారు. ఏకంగా రైలు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి రైలును ఆపి ప్రయాణికులకు దోచుకున్నారు. గాఢనిద్రలో ఉన్న పలువురు ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, మరికొందరి నుంచి నగదు ఎత్తుకెళ్లిపోయారు. సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు అపహరించినట్లు పోలీసులు ప్రాథమికం గా గుర్తించారు.
- గత నెలలో హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సబ్ ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించి, కత్తులతో గాయపరిచి బంగారు గొలుసు, రెండు సెల్‌ఫోన్లు, నగదు దోచుకుని పారిపోయారు.






