18 August, 2026 | 10:03 AM

‘డయల్ యువర్ ఎండీ’తో సమస్యలకు పరిష్కారం

16-06-2024 12:05 AM

జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): ‘డయల్ యువర్ ఎండీ’ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన డయల్ యువర్ ఎండీ కార్యక్రమం శనివారం పునఃప్రారంభమైంది. ఈ సందర్భం గా ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌ను ఎండీ నేరుగా స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు 36 మంది ఫోన్ చేసి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఎండీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఆ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, వచ్చిన ఫిర్యాదుల్లో తాగునీటి సరఫరా, కలుషిత నీరు, సీవరేజీ ఓవర్‌ఫ్లో, పైపులైన్ల నుంచి లీకేజీలు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ స్వామి, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.