22 March, 2026 | 1:44 AM

రాములోరి కల్యాణానికి వేళాయే!

22-03-2026 12:12 AM

27, 28 తేదీల్లో వైభవంగా సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవం

వేడుకలకు ముస్తాబైన భద్రాద్రి రామాలయం 

పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

భద్రాచలం/మణుగూరు, మార్చి 21 (విజయక్రాంతి): దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 27, 28న సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. మిథిలా మండపంలో కళ్యాణ క్రతువు అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. రంగురంగుల పూలు, స్వాగత తోర ణాలతో పెళ్లి వేడుకకు ముస్తాబైంది.

ముత్యాల ముగ్గు లు, తీరొక్కపూలతో అలంకరించిన పెళ్లి మండపం కల్యాణ క్రతువుకు సిద్ధమైంది. జానకిరాముడు, సీతమ్మకు జరిగే పెళ్లి వేడుక సరిగ్గా 12 గంటలకు మూల వరులకు బెల్లం, జీలకర్ర పెట్టడం మాంగల్య ధారణకు ముందు జరుగుతుంది. దీనికే శుభ ముహూర్తం అని పేరు. భద్రాద్రి సీతారాముల కళ్యాణంలో ఈ సమయాన్ని అభిజన్ముహూర్తం అని అంటారు. ఈ అభిజిల్ల గ్మం సర్వ శుభాలను కలిగిస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతున్నది.

కల్యాణ ఘట్టానికి సంబం ధించిన పూజ లు కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగనున్నాయి. ఈ మహోత్స వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై, స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మాంగల్యధారణ తరువాత జరిగే అద్భుత ఘట్టం ముత్యాల తలంబ్రాలు. వివాహ వేడుకలలో పోసుకునే తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి.

కానీ, శ్రీరామనవమి నాడు భద్రాద్రిలో జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు ఎర్రరంగులో ఉంటాయి. ఆనాడు రామదాసును ఖైదుచేశానని పశ్చాత్తప్పడిన తానీషా ప్రభువు ఏటా శ్రీరామ నవమి నాడు జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి గులా లు (బుక్కా గులాల్), పట్టు బట్టలు, ముత్యాల తలంబ్రాలను పంపించాడు. అదే సంప్రదాయం నేటికీ కొనసా గుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేటికీ ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తున్నారు. 

ప్రత్యేక ఆభరణాలన్నీ పెండ్లిలోనే..

భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతా కు పతకం, శ్రీరాముడికి, సీతకు సమర్పిస్తారు. అలాగే రామదాసు బందీఖానాలో ఉండగా సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులే తానీషా దగ్గరకి సిపాయిల రూపాల్లో వెళ్లా రు. రామదాసు ఆలయం నిర్మించటానికి ఆరులక్షల వెండికాసులు వ్యయం చేస్తే, ఆరులక్షల బంగారు రామమాడలను రామలక్ష్మణులు తానీషాకి చెల్లించి, రామ దాసును చెర నుంచి విడిపించారని నానుడి. ఆ చరిత్ర కు సాక్ష్యంగా, శ్రీరాముడే అనుగ్రహించి వెళ్లిన శ్రీరామదాసు శ్రీలక్ష్మణస్వామికి సమర్పిస్తారు. 

మూడు పతకాల మంగళసూత్రం

పెళ్లి వేడుకల్లో వధువుకు వరుడు కట్టే తాళికి రెండు తాళిబొట్లు మాత్రమే ఉంటాయి. కానీ, భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతామాతకు సమర్పించే మంగళసూత్రంలో మూడు తాళిబొట్లు ఉంటాయి. మామ దశర థమహారాజు చేయించిన ఒక తాళిబొట్టు, జనక మహారాజు వేయించిన మరో తాళి బొట్టు, సీతమ్మ తల్లి ని తన కూతురుగా భావించి భక్తరామదాసు చేయించిన తాళిబొట్టుతో కలిపి మూడు పతకముల మంగళ సూత్రాన్ని సీతమ్మవారికి సమర్పిస్తారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

సీతారాముల కల్యాణానికి మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. స్టేడియం ప్రాంగణాన్ని 24 సెక్టా ర్లుగా విభజించారు. అన్ని సెక్టార్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. 3 వేల మంది కూర్చునే విధంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. కల్యాణ మండపం ప్రాంగణంలో 2 టన్నుల ఏసీలు 50, వంద కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. లక్ష చదరపు అడుగుల్లో ప్రత్యేక పైపు లైన్ ద్వారా పొగమంచు వెదజల్లే 800 పరికరాలతో వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఇంటి ముంగిటికే తలంబ్రాలు

శ్రీరామనవమి వేడుకల పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేసేందుకు టీజీఆర్టీసీ కార్గో విభాగం నడుం బిగించింది. కేవలం రూ.151 చెల్లించి తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్‌లో అక్షింతలతో పాటు రెండు ముత్యాలు కూడా ఉంటాయి. ఈ మేరకు ఆలయ ఈవో దామోదర్‌రావు పర్యవేక్షణలో ఆలయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.