15 April, 2026 | 2:58 AM

రాష్ట్రంలో భానుడి భగభగలు

15-04-2026 12:25 AM
  1. ఐదు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత
  2. నల్లగొండ జిల్లా అడివివేవులపల్లిలో 43.5 డిగ్రీలు

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండల తీవ్రతతో మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. మంగళవారం రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐదు జిల్లాల్లో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నల్లగొండ జిల్లా అడవి దేవులపల్లిలో అత్యధికంగా 43.5 డిగ్రీలు, జగిత్యాల కోరుట్లలో 43.4, నిర్మల్ దస్తురాబాద్‌లో 43.3, నిజామాబాద్ భీంగల్‌లో 43.3, ఆదిలాబాద్ బేలాలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక మిగిలిన జిల్లాల్లో 40.9 డిగ్రీల నుంచి 42.9 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే రోజు అత్యధికంగా 43.3 డిగ్రీలు నమోదు కాగా ఈ సారి 43.5 డిగ్రీలు నమోదవడం గమనార్హం. బుధవారం, గురువారం, శుక్రవారం ఈ మూడు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లను జారీ చేసింది. 

జిల్లాలకు హెచ్చరికలు

ఈ నెల 18 వరకు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేశారు. అలాగే ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, నాగర్ కర్నూల్,  గద్వాల, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వనపర్తి, వరంగల్‌కు 18 వరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేశారు. ఈ జిల్లాల్లో రానున్న రోజుల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా.