17-12-2025 09:59:06 AM
న్యూఢిల్లీ: ప్రయాణికులకు సర్జ్ ప్రైసింగ్ నుండి ఉపశమనం కల్పించడంతో పాటు డ్రైవర్లకు సరసమైన ధరలను నిర్ధారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీ పేరుతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ట్యాక్సీ-హెయిలింగ్ అప్లికేషన్‌ను 2026 జనవరి 1 నుండి ఢిల్లీలో ప్రారంభించబోతోంది. దేశ రాజధానిలో ప్రారంభం కానున్న భారత్ టాక్సీ యాప్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సొంత ట్యాక్సీ ప్లాట్‌ఫామ్. యాప్ ఆధారిత క్యాబ్ సేవల్లో తరచుగా జరిగే ధరల పెరుగుదల సమస్యను పరిష్కరించడమే దీని ఉద్దేశం.
ఈ యాప్ కార్లు, మోటార్ సైకిల్, ఆటో-రిక్షాలతో సహా బహుళ రవాణా ఎంపికలను అందించడమే కాకుండా ఓలా, ఉబర్ చార్జీల నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తుంది. అలాగే డ్రైవర్లు కూడా చార్జీల్లో 80 శాతానికి పైగా పొందే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇప్పటికే 56,000 మందికి పైగా డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఎంఎస్సీఎస్ చట్టం కింద ఏర్పడిన బహుళ-రాష్ట్ర సహకార సంస్థ అయిన సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుందని సహకార మంత్రి అమిత్ షా లోక్‌సభకు తెలియజేశారు. సభలో జరిగిన చర్చ సందర్భంగా, ప్రైవేట్ అగ్రిగేటర్లపై డ్రైవర్లు ఆధారపడటాన్ని తగ్గించడానికి సహకార నేతృత్వంలోని మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని షా పేర్కొన్నారు. డ్రైవర్లకు వారి ఆదాయం, పని పరిస్థితులపై మరింత నియంత్రణ కల్పించడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యమని ఆయన వెల్లడించారు.