భారతీ బిల్డర్స్ మాయ!
- సొంతింటి కలనే పెట్టుబడిగా పెట్టి 450 మందికి టోకరా
సైబరాబాద్ ఈఓడబ్ల్యూ కేసు ఆధారంగా ఈడీ విచారణ
రూ. 17.97 కోట్ల ఆస్తులు ఈడీ జప్తు
హైదరాబాద్ , సిటీబ్యూరో మార్చి 23 (విజయక్రాంతి):సొంతింటి కలని ఆశగా చూపి, వందలాది మంది మధ్యతరగతి ప్రజలను నిలువునా ముంచిన ‘భారతీ బిల్డర్స్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ సంస్థకు చెందిన రూ. 17.97 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం బుధవారం ప్రకటించింది.
జప్తు చేసిన ఆస్తుల్లో సంస్థ భాగస్వాములు, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూములు, భవనాలు ఇతర ఆస్తులు ఉన్నాయి. సామాన్య ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన కోట్లాది రూపాయలను దారిమళ్లించి, వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నట్లు ఈడీ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
రూ. 92 కోట్ల వసూలు.. నిధుల మళ్లింపు..
నిందితులు కొనుగోలుదారుల నుంచి సుమారు రూ. 75 కోట్ల అడ్వాన్సులను బ్యాంక్ ఖాతాల ద్వారా, మరో రూ. 17 కోట్ల నగదును మొత్తం రూ. 92 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ నిధులను ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి వాడకుండా.. పాత అప్పులు తీర్చడానికి, కమీషన్లు చెల్లించడానికి, సొంత పేరుతో ఇతర స్థిరాస్తులు కొనడానికి మళ్లించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే..
ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూమిని కొనుగోలుదారులకు తెలియకుండానే ఇతర వ్యక్తులకు విక్రయించేశారు. భూమి అమ్మేసిన తర్వాత కూడా కొత్త కస్టమర్ల వద్ద నుంచి అడ్వాన్సులు వసూలు చేస్తూనే ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిధుల మళ్లింపు కోసం, బ్యాంకింగ్ నిధులను నగదుగా మార్చుకోవడం కోసం భారీగా కమీషన్లు కూడా చెల్లించినట్లు ఈడీ సాక్ష్యాలను సేకరించింది. ఈ కుంభకోణం వల్ల వందలాది కుటుంబాలు వీధిన పడ్డాయని, వారి కష్టార్జితాన్ని రక్షించేందుకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈడీ అధికారులు తెలిపారు.
ప్రీ లాంచ్ స్కీమ్ పేరుతో దగా..
సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. భారతీ బిల్డర్స్ మేనేజింగ్ పార్టనర్ ముల్పూరి శివరామకృష్ణ, దుపాటి నాగరాజు, దొడ్డకుల నరసింహారావు తదితరులు కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం మోసానికి పాల్పడ్డారు.
భారతీ లేక్ వ్యూ టవర్స్ అనే ప్రాజెక్ట్ పేరుతో ఆకర్షణీయమైన ప్రీ లాంచ్ స్కీమ్ ప్రకటించి, సుమారు 450 మందికి పైగా ఇంటి కొనుగోలుదారులను తమ వలలో వేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం చట్టబద్ధమైన అనుమతులు లేవన్న నిజాన్ని బిల్డర్లు దాచారు. అంతేకాకుండా, ప్రాజెక్ట్ చేపట్టాల్సిన భూమి అప్పటికే ఇతర బ్యాంకుల్లో అప్పుల కోసం తాకట్టులో ఉందన్న విషయాన్ని కూడా కొనుగోలుదారులకు తెలియనివ్వలేదు.




