శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు: నీలం మధు ముదిరాజ్
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి ఎంపికైన భాస్కర్ కు సన్మానం
గతంలో తన కోచింగ్ కు సాయం చేసిన నీలం మధుకు ధన్యవాదాలు తెలిపిన భాస్కర్
పటాన్ చెరు: విద్యార్థులు కష్టపడి చదువుకుని శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం, పోమ్యా నాయక్ తండాకు చెందిన ధారావత్ భాస్కర్ యుపిఎస్సి నిర్వహించిన 'సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్' పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, అసిస్టెంట్ కమాండెంట్ ఫలితాల్లో దేశంలోనే 58వ ర్యాంక్, ST కేటగిరీ విభాగంలో ఆల్ ఇండియా 1వ ర్యాంక్ సాధించారు. గతంలో భాస్కర్ కోచింగ్ నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీలం మధు ముదిరాజ్ అతనికి సహాయం అందించడమే కాకుండా, శిక్షణ సమయంలోనూ నిరంతరం ప్రోత్సహించి చేయూతనందించారు.
ఉన్నత ఉద్యోగానికి ఎంపికైన అనంతరం ధారావత్ భాస్కర్, ఈ రోజు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ ను తన కార్యాలయంలో కలిసి తనకు అందించిన సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సత్కరించారు . ఈ సందర్భంగా భాస్కర్ పట్టుదల, కష్టపడే తత్వాన్ని నీలం మధు అభినందిస్తూ అతడిని శాలువాతో సన్మానించారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ..., గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు పట్టుదలతో చదివి కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ కమాండెంట్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించడం ఎంతో గర్వకారణమని, నేటి యువతకు భాస్కర్ ఆదర్శమని కొనియాడారు. భవిష్యత్తులో భాస్కర్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.






