25 August, 2026 | 6:31 PM

ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు!

25-08-2026 05:58 PM

అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన కుత్బుల్లాపూర్ భూములను వెంటనే తొలగించాలి...

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి

మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భూములను అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అర్హులైన భూ యజమానుల భూములను 22-A జాబితా నుంచి తొలగించాలని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్‌నగర్‌లోని ఎం.జే. గార్డెన్స్‌లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 22-A బాధితుల సమస్యలపై బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి హరీష్ రావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ...తెలంగాణలో 22-A సమస్య కేవలం రిజిస్ట్రేషన్ సమస్య కాదు.. వేలాది మంది భూ యజమానుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యని అన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బుతో భూములు కొనుగోలు చేసి, చట్టబద్ధమైన పత్రాలు, పట్టాలు కలిగి ఉండి, పన్నులు చెల్లిస్తున్న ప్రజల భూములను ఒక్కసారిగా 22-A జాబితాలో చేర్చడం వల్ల వారు తమ భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్ చేసుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22-A అంటే కేవలం ఒక నంబర్ కాదు.. ఒక కుటుంబం భవిష్యత్తుపై పడే తాళమని అన్నారు.

ఒక కుటుంబం తన భూమిని అమ్మి పిల్లల చదువుకు ఖర్చు చేయవచ్చు, కూతురి వివాహం చేయవచ్చు, వ్యాపారం ప్రారంభించవచ్చు, అనారోగ్య సమయంలో వైద్య ఖర్చులు భరించవచ్చు, ఇల్లు నిర్మించుకోవచ్చని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజల భూములను నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.22-A అంశంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, తప్పు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భూభారతి సాక్షిగా ఈ అక్రమాలు జరుగుతున్నాయి. 2023 డిసెంబర్ నుంచి 22-A జాబితాలో చేర్చిన, తొలగించిన సర్వే నంబర్లపై పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని అన్నారు.

తప్పు చేయలేదని ప్రభుత్వం చెబుతున్నట్లయితే, సంబంధిత శాఖ బాధ్యత వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిది తప్పు లేకపోతే వెంటనే పొంగులేటిని బర్తరఫ్ చేయాలని సవాల్ చేశారు. మీకు రియల్ ఎస్టేట్ తెలుసు అంటే.. మాకు పోరాటాలు తెలుసు... ప్రజల పక్షాన ఎలా పోరాడాలో మాకు తెలుసని స్పష్టం చేశారు. 22-A బాధితుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 7వ తేదీలోగా లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తాం. అసెంబ్లీలో కొట్లాడుతాం.. బయట బిఆర్ఎస్ శ్రేణులు పోరాడుతాయి.

ప్రజలకు కంటికి రెప్పలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యులను గుర్తించి శిక్షిస్తాం ఆయన స్పష్టం చేశారు. ప్రజల భూములపై కన్నేస్తే సహించేది లేదు..ప్రజల హక్కులను హరిస్తే పోరాటం ఆపేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పలు కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా నాయకురాల్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.