చీకట్లోనే 44వ జాతీయ రహదారి..
- పట్టించుకోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
భిక్కనూర్, అక్టోబర్ 4 (విజయ క్రాంతి): జాతీయ రహదారి-44పై (National Highway-44)భిక్కనూర్ పరిధిలో(Bhikkanoor Highway) సెంటర్ లైటింగ్ వ్యవస్థ నెలలుగా పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైమాస్ట్ లైట్లు, సెంటర్ లైటింగ్ వెలగకపోవడంతో ప్రధాన రహదారి చీకటిమయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-నిజామాబాద్ మధ్య నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే భిక్కనూర్ ప్రధాన రహదారిపై లైటింగ్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు హెడ్లైట్ల వెలుతురులోనే ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు.
ముఖ్యంగా భిక్కనూర్ చౌరస్తా వద్ద రోడ్డు దాటే పాదచారులు, పట్టణంలోకి వచ్చే వాహనాలకు లైటింగ్ లేకపోవడం ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ద్విచక్ర వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
లైటింగ్ సమస్యపై పలుమార్లు జాతీయ రహదారి అథారిటీ అధికారులకు, టోల్ ప్లాజా యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. టోల్ వసూలుతో పాటు రహదారి నిర్వహణ, లైటింగ్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భిక్కనూర్ పరిధిలో హైవే లైటింగ్ను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.