16 May, 2026 | 1:53 AM

భోజ్‌శాల మందిరమే

16-05-2026 12:49 AM
  1. మందిర్-మసీద్ కేసులో ఎంపీ హైకోర్టు సంచలన తీర్పు
  2. ముస్లింల ప్రార్థనలకు వేరే స్థలం కోరవచ్చునని వెల్లడి

భోపాల్, మే 15: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని వివాదాస్పద ‘భోజ్‌శాల -కమల్ మౌలా మసీదు’ ప్రాంగణం హిందువులదేనని, అది సరస్వతీ దేవికి అంకితం చేసిన ఒక ఆలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో, ఆ ప్రదేశంలో ముస్లింలు శుక్రవార ప్రార్థన లు చేసుకోవడానికి గతంలో పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఇచ్చిన ఉత్తర్వును కోర్టు రద్దు చేసింది.

2003 ఏప్రిల్‌లో ఏఎస్‌ఐ జారీచేసిన ఆ ఉత్తర్వు, భోజ్‌శాల ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునే హక్కును కూడా పరిమితం చేసింది. అయితే న్యాయమూర్తులు విజయ్ కుమార్ శుక్లా, అలోక్ అవస్థిలతో కూడిన ధర్మాసనం, 242 పేజీల తీర్పులో భోజ్‌శాల సరస్వతి దేవి ఆలయానిదేనని తీర్పి చ్చింది. మసీదు నిర్మాణం కోసం జిల్లాలో వేరే స్థలాన్ని కేటాయించమని ముస్లింలు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరవచ్చని కోర్టు సూచించింది.

ధార్ జిల్లా లోని ప్రసిద్ధ భోజ్‌శాల వివాదంలో మధ ప్రదేశ్ హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. భోజ్‌శాలను హిందూ దేవా లయంగా ప్రకటిస్తూ.. ఉమ్మడి విధానాన్ని రద్దు చేసింది. ఆలయం తమకే చెందాలన్న హిందువుల డిమాండ్‌ను అంగీకరించింది. భోజ్‌శాలలో హిందూ ఆరాధన కొనసాగింపు ఎన్నడూ ఆగలేదని కోర్టు పేర్కొంది. చారిత్రక గ్రంథాల ప్రకారం వివాదాస్పద ప్రాంతం పర్మార్ వంశానికి చెందిన భోజరాజుతో సంబం ధం ఉన్న సంస్కృత విద్యాకేంద్రమైన భోజ్‌శాలగా ప్రసిద్ధి చెందిందని రుజువు చేస్తున్నాయని తెలిపింది.

ఆలయాన్ని పు రావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని, ఆలయంలో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి సూచించింది. పురావస్తు చారిత్రక వాస్తవాలు, ఏఎస్‌ఐ నోటిఫికేషన్లు, సర్వే నివేదికలను పరిగణనలోకి తీసుకున్నామని హైకోర్టు పేర్కొంది. ఈ చట్టంలోని శాసనబద్ధ నిబంధనలు, అయోధ్య కేసులోని పూర్వనిర్ణయం, పురావస్తు ఆధారాల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని, ఏఎస్‌ఐ నిర్వహించిన అధ్యయనాల ఫలితాలను కోర్టు విశ్లేషించింది.

అదే సమయంలో మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం ముస్లింవర్గాలకు సూచించింది. ఇక్కడ పూజించుకునే హక్కును కల్పించిందన్నారు. ఇక భోజ్‌శాలలో కేవలం పూజలు మాత్రమే జరుగుతాయని స్పష్టం చేశారు. భోజ్‌శాల ఆలయ వివాదం దశాబ్ధాలుగా కొనసాగుతోంది. భోజ్‌శాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందూవులు వాగ్దేవి దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్‌మౌలా మసీదుగా వ్యవహరిస్తుంటారు.

2003 ఏఎస్‌ఐ ఒప్పందం ప్రకారం, హిందువులు మంగళవారాల్లో, ముస్లింలు శుక్రవారాల్లో ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రదేశంలో ఆరాధన కోసం ప్రత్యేక హక్కులు కోరుతూ హిందూవర్గం ఈ ఒప్పందాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. ఆలయస్థలం మసీదుకు చెందిందని ముస్లింవర్గాలు వాదించాయి. దీంతో ఈ ప్రాంతంలో 2024లో 98 రోజులపాటు పురావస్తు శాఖ సర్వే నిర్వహించి 2024 జూలై 15న కోర్టుకు నివేదిక సమర్పించింది.

దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం తుదితీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు శుక్రవారం ప్రార్థనల సమయంలో వెలువడటంతో, రాష్ట్ర ప్రభుత్వం 1,200 మంది పోలీసు సిబ్బందిని మోహరించి, ఆ ప్రదేశం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసింది.

ఈ తీర్పు నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతల తలెత్తే అవకాశం ఉండడంతో, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తికి వ్యతిరేకంగా ధార్ కలెక్టర్ రాజీవ్ రంజన్ మీనా బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. అయితే తీర్పు వెలువడిన తర్వాత, పూర్తి తీర్పును క్షుణ్ణంగా సమీక్షించిన పిమ్మట ముస్లింవర్గం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందని షహర్ ఖాజీ వకార్ సాదిఖ్ సూచించారు.