16 May, 2026 | 1:53 AM

జూన్ 21న మళ్లీ నీట్

16-05-2026 12:54 AM
  1. పరీక్షా సమయం 15 ని.. పొడిగింపు 
  2. 14 నాటికి అడ్మిట్ కార్డులు
  3. పరీక్షా కేంద్రాల ఎంపికకు వారం గడువు 
  4. మళ్లీ ఫీజు కట్టవద్దు 
  5. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  6. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  7. నీట్ పేపర్ లీక్‌లో కీలక సూత్రధారి అరెస్ట్
  8. పుణెలో కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని అదుపులోకి తీసుకున్న సీబీఐ

న్యూఢిల్లీ, మే 15: నీట్ యూజీ పరీక్ష మళ్లీ జూన్ 21న జరుగుతుందని, ఈ పరీ క్షా సమయాన్ని 15 నిమిషాలపాటు పొడిగించామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకల దృష్ట్యా చేపట్టిన సంస్కరణలలో భాగం గా, వచ్చే ఏడాది నుంచి ఈ వైద్య ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

విద్యార్థు ల భవిష్యత్తే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, నీట్‌యూజీ అవకతవకలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇలాఉండగా, నీట్ పేపర్ లీక్‌లో కీలక సూత్రధారి, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని పూణెలో సీబీఐ అరెస్ట్ చేసింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు జరుగుతున్న సన్నాహాలను సమీక్షించేందుకు గురువారం రాత్రి మంత్రి ప్రధాన్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ప్రధాన్ స్పష్టం చేశారు. నీట్ నిర్వహణలో ఎటువంటి అవకతవకలు బయటపడినా సహించబోమని హెచ్చరించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. మే 3న నిర్వహించిన ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్’ (అండర్ గ్రాడ్యుయేట్) పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరగడంతో ఆ పరీక్ష రద్దు చేశామన్నారు. 

మళ్లీ నీట్‌ను జూన్ 21న నిర్వహిస్తామని, ఈ పరీక్షా సమయాన్ని 15 నిమిషాలు పొడిగించినట్లు ప్రధాన్ తెలిపారు. ‘మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాల్సిన ఈ పరీక్ష, ఇప్పుడు సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. అభ్యర్థులు తమకు నచ్చిన పరీక్షా కేంద్రాలను (నగరాలను) మరోసారి ఎంచుకునేందుకు వారం రోజుల అవకాశం ఉంటుందని, ఫీజు కట్టాల్సిన పనిలేదని, జూన్ 14 నాటికి అడ్మిట్ కార్డులు అందుతాయని ఆయన పేర్కొన్నారు.

రవాణా ఏర్పాట్ల కోసం కేంద్రం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని, తాను స్వయంగా ముఖ్యమంత్రులతో మాట్లాడతానని మంత్రి తెలిపారు. జూన్ 21వ తేదీకి సంబంధించి వాతావరణ సంబంధిత ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఎన్టీఏ పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల రవాణా ఏర్పాట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటుందని ఆయన తెలిపారు. ‘విద్యార్థుల భవిష్యత్తే మా అత్యంత ప్రాధాన్యత అన్నారు.

విద్యార్థులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానని, ఎటువంటి భయం లేకుండా పరీక్షకు హాజరవ్వండి, ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందన్నారు. ఈసారి ఎటువంటి అక్రమాలు జరగనివ్వబోం’ అని ఆయన స్పష్టం చేశారు. గతంలో అవకతవకలు వెలుగుచూసినప్పుడు కూడా ‘రాధాకృష్ణన్ కమిటీ’ని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సులను అమలు చేశామని మంత్రి తెలిపారు. ‘అవన్నీ చేసినప్పటికీ, మళ్లీ పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశాం.

విద్యా మాఫియా కుట్రల వల్ల గానీ, లేదా అక్రమ మార్గాల ద్వారా అనర్హులైన అభ్యర్థులు ఎట్టిపరిస్థితుల్లో లబ్ధిపొందవద్దు’ అని చెప్పారు. ఏ ఒక్క అర్హత కలిగిన విద్యార్థి కూడా తమ హక్కులను కోల్పోకూడదని తెలిపారు. అందుకే ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని, దర్యాప్తు పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. 

కీలక సూత్రధారి అరెస్ట్..

నీట్ పేపర్ లీక్ కేసులో కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని సీబీఐ కీలక సూత్రధారిగా గుర్తించి, అరెస్ట్ చేసింది. కులకర్ణిని పుణెలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్‌టీఏలో భాగస్వామిగా ఉన్నాడు. మరో నిందితుడితో కలిసి ఏప్రిల్ చివరి వరకు విద్యార్థులను సమీకరించాడు. కులకర్ణి పుణెలోని తన ఇంట్లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.

లాతూరుకు చెందిన రసాయనశాస్త్ర నిపుణుడు అయిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణి, ఏళ్ల తరబడి నీట్ ప్రశ్నపత్రాన్ని రూపొందించే ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నారని సీబీఐ అధికారులు తెలిపారు. ఈయన తన నివాసంలోనే ప్రత్యేక కోచింగ్ తరగతులను నిర్వహించారని చెప్పారు.

ఏప్రిల్ 2026 చివరి వారంలో, మరొక నిందితురాలైన మనీషా వాఘ్మారే సహాయంతో ఆయన విద్యార్థులను సమీకరించారని వెల్లడించారు. ఈ మనీషా వాఘ్మారేను సీబీఐ మే 14న(గురువారం) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రొఫెసర్ కులకర్ణి చెప్పగా విద్యార్థులు తమ నోట్‌బుక్‌లో చేతిరాతతో రాసుకున్నారని, ఆ ప్రశ్నలు, మే 3న జరిగిన నీట్‌లో కచ్చితంగా వచ్చినట్లు అధికారులు గుర్తించారు.