ఎందుకొచ్చిన వచన కవిత!?
‘సింహాసనాలు కంపిస్తాయి. బ్రహ్మాండం దాకా విస్తరించి కడకు కూసాలు కదిలి కూలిపోతాయి. సింహాసనం వాటేసుకున్న వాడెవడూ దాన్ని తనతో మోసుకెళ్ళ లేకపోయాడు’. ‘సూర్యున్ని కావలించుకుందామని కిటికీ రెక్క తీస్తే వెనక్కి తిరిగి రానంటూ మారాం చేస్తూ తెల్లటి మబ్బుల్లో వెచ్చగా దాక్కుంది మనసు. పట్టుకోవడానికి మబ్బేదో మనసేదో తెలిస్తే కదా! దేహం లోపల మోహం ఉందో, మొత్తం మోహమే దేహమైందో కానీ బయట చలికి లోపలి నిప్పు కణిక నిద్ర పోనివ్వదు, మేలుకోనివ్వదు’.
‘రెండు పెను మార్పుల మధ్య గత రెండు సంగ్రామాల నీడయిన మరో గ్లోబాధిపత్య యుద్ధ లాలసలో ఓ దిక్కు కార్మిక లోకం, మరో దిక్కు కర్షక జీవితం. కోనల మధ్య, తాత్త్విక మథనాల నేపథ్యంలో...’ కవితా వార్షిక 2004, పే. 46, 49, 87. ‘ఎక్కడ లేడు వాడు? ఏ నేలనైతేనేమి? ఏ కాలమైతేనేమి? ఎక్కడైనా ఎప్పుడైనా నిరంతరం మనిషి వాడు. నిత్యం స్పందించే మనీషి వాడు. జనంలో ఉన్నా, జనారణ్యంలో ఉన్నా, జన స్రవంతిలో ఉన్నది వాడొక్కడే’- ఆకాశం అంతరించదు. పే.32. ‘కొందరు మానవతను కిరీటంగా ధరిస్తారు. కొందరు మానవతను హారంగా ధరిస్తారు. కొందరు మానవతను కంకణంగా ధరిస్తారు’. సమకాలీనం. పే. 43.
పైన ఉదహరించినవన్నీ సమకాలీన కవితా ప్రపంచంలో ప్రసిద్ధులైన కవుల వచన పద్యాలు. ఇవన్నీ సంకలనాలలో ప్రచురణలలో పాదాలుగా విభజింపబడి అచ్చయినవి. ఇలా వేల కవితా సంపుటాల నుండి ఉదహరిస్తూ పోవచ్చు. ఇక్కడ ప్రధాన సందేహం ‘పాద విభజనకు కవులు అలా అనుసరించే వ్యూహం ఏమిటని? ఏ కవికి ఆ కవికి ప్రత్యేక వ్యూహం ఉన్నట్టా? లేక, వచన కవులందరికీ సమానమైన ఛందశ్శాస్త్రం ఏమైనా ఉన్నట్టా?’ దీనికి సమాధానం కోసం అన్వేషిస్తూ పోవలసిందే.
శేషేంద్ర ‘నా దేశం నా ప్రజలు’ పాద విభజన లేకుండా వచనం లాగానే ముద్రించబడింది. ఐనా, పాద విభక్త రూపం లేని ఆ కావ్యంలో కవిత్వానికి ఏ లోటూ రాలేదు. అట్లాగే, ఈ విభజనకు ఆధారమైంది ఏదో శబ్ద లయో, భావ లయో ఉన్నదన్న వాదం ఇంకా నిరూపితం కానేలేదు.
హైకూలాంటి ఛందస్సు మనకు జపాన్ కవితలో నుంచి వచ్చింది. దీనిలో అక్షర నియతి ఉండటం, మూడు పాదాలుగా విభక్తం కావడం రూప నిర్ణయానికి పనికి వస్తుంది. ఈ నిర్ణయం వెనకాల ఆ కవిత్వం పుట్టిన మూలాలలో ధ్యానం ప్రధాన అంశం కావడం మనం మరిచి పోవడానికి వీలు లేదు. ఈ ధ్యానం వెనుక ప్రాణాయామం ఉన్నది. అక్షరాల సంఖ్య ఉచ్ఛ్వాస నిశ్శ్వాస కుంభకాలను సూచిస్తుంది. దాని నిడివి ‘17 చిత్తక్షణాల’లో ఒదిగిపోవడం.
ఈ చిత్తక్షణాలను ’ఒన్ జి’ లన్నారు. మూడు పాదాలై 5+7+5 గా ఉండటం సామాన్య లక్షణం. ఇది అనుష్టుబర్ధం కన్నా ఒక అక్షరం ఎక్కువ. గాయత్రిని త్రిపాదిగా చూచినపుడు దానికన్న ఒక అక్షరం ఎక్కువ. రేచక పూరక కుంభకాలతో అనుబద్ధమైన ఈ ప్రక్రియ అంతస్తత్వము యోగమార్గానికి చెందింది. దీనిలో విస్తరింపబడే వస్తువు కూడా యోగమార్గానికి ఉపకరించే అంతర్ముఖత్వం కలిగించేదిగా ఉండటం ఔచిత్యంతో కూడిన అంశం. ఐతే, ఇటీవల వెలువడుతున్న నానీలకు ఇటువంటి తాత్త్విక భూమిక ఏదైనా ఉన్నట్టు గోచరించడం లేదు.
ఐతే 60, 70 ఏళ్ళుగా తెలుగుదేశంలో ప్రవహిస్తున్న వచన కవిత్వానికి ఇంకా నిర్దిష్ట రూపం అంటూ ఏర్పడినట్టుగా లేదు. నియతీ లేదు. కట్టడీ లేదు. పద్యానికి ఉన్న శక్తిని ఇంకా సంపాదించవలసే ఉన్నది.
సుమారు 15 సంవత్సరాలకు ముందు హైదరాబాదులో ‘కవి సమయం’ అనే ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్తూ శ్రీ సంపత్కుమార గారు నాచేత, శ్రీ మాదిరాజు రంగారావు గారిచేత రెండు వచన కవితలు రాయించి అక్కడ సమావేశంలో మామూలు వచనం లాగా ప్రకటించి, పాల్గొన్న ప్రతినిధులైన కవులను ఎవరికి వారిని పాద విభజన చేసి అందించమని కోరారు. అయితే, ఏ ఒక్కరి పాద విభజన మరొకరి విభజనతో సమానంగా లేదని వారు చెప్పారు.
అసలు చే.రా.కు, సంపత్కుమార గారికి వచన పద్యం మీద వచ్చిన పేచీ అంతా దీనికి సహజమైన నిర్దిష్టమైన స్వరూపం లేదనే. ఆ విషయంలో వాళ్ళు అంతగా పేచీ పడీ చివరకు ఏమీ తేల్చుకోలేకపోయారు. ఇప్పుడు ఆలోచిస్తుంటే చేరావైపే సత్యం మొగ్గు చూపుతున్నదనిపిస్తున్నది. ఈ వ్యాసం మొదట పేర్కొన్న వచన కవితలు అన్నీ వచనం లాగానే ఉన్నాయి. వేయేళ్ళ నుంచి వస్తున్న పద్యానికైతే గణబద్ధమైన నియతరూపం ఉన్నది. అంతర్గతంగా ఒక సంగీత సాంతత్యం ఉన్నది. నడకలో లయ ఉన్నది. ఈ సంగీతము లయను భావానికి తూగును, గతిలోని వైవిధ్యాన్ని అందిస్తున్నది.
వచన కవిత్వ వికాసంలో ఆరుద్ర అంత్యప్రాసలు వాడి, కుందుర్తి రూపకాలంకారాలు వాడి, దాన్ని వచనం కంటే విడిగా చూపేందుకు ప్రయత్నం చేశారు. ఇంకా ప్రతీకలు, భావచిత్రాలు దానికి బరువును సంతరించి పెట్టాయి. యాభైలలో వజీర్రహమాన్ చలం రచనలలోంచి కొన్ని భాగాలు ఎత్తి పాదాలుగా విభజించి చూపి అదంతా కవిత్వమని, ఒప్పించి ‘కవిగా చలం’ అనే పుస్తకం ప్రకటించినారు.
ఇలాగే రావిశాస్త్రి వచనాలలోనూ, మల్లాది రామకృష్ణశాస్త్రి కథల్లోనూ, ఆచంట జానకిరాం వచనంలోనూ, ‘వేయి పడగల’లోని వర్ణనల్లోనూ కవిత్వాన్ని పుష్కలంగా చూడవచ్చు. వచన కవిత్వమనే పేర ప్రకటింపబడుతున్న విభక్త పాదరూపం నిర్హేతుకంగా కనిపిస్తున్నది. ఇక్కడ ప్రసిద్ధులని, అప్రసిద్ధులని భేదం చూడనక్కరలేదు. కొందరు ప్రయోగ చమత్కారాలమీద ఆధారపడి వచనాన్ని విశ్లధం చేస్తారు. నామవాచకాలను క్రియలుగా మారుస్తూ భాషలో ప్రయోగాలు చేస్తుంటారు. ఇది ప్రజల భాషలో ఎక్కడా ఉపయోగపడే పలుకుబడి కాదు.
పేర్ల పేటెంటు కోసం ముక్తచ్ఛందం అన్నా, స్వేచ్ఛా కవిత్వం అన్నా, వచన కవిత్వం అన్నా, వచన పద్యం అన్నా, ఇలా సహస్ర నామార్చన చేసినా అసలు వస్తువును చూస్తే అది శుద్ధ వచనమే, బాణుడి లాంటి వాడు కాదంబరివల్ల మహాకవి కాలేదా? పద్యాలు రాసినంత మాత్రాన చరకుడో, వరాహ మిహిరుడో కవులైనారా? ఇన్నేళ్ళ తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూచుకుంటే ఎందుకీ వ్యర్థ శ్రమ? అనిపిస్తుంది.
చక్కగా వచనంలా రాసుకుంటే ఎన్ని పేజీలు మిగులుతాయి? ఎంత శ్రమ తగ్గుతుంది? అబ్బూరి రామకృష్ణారావు గారు ఎన్నోసార్లు చెప్తూ ఇంత అనిర్ధిష్ట రూపంగల ఏ నియతికీ లొంగని వచన కవిత్వం అన్న పదార్థం ఒక్క తెలుగులోనే ఉంది తప్ప ఏ ఇతర భారతీయ భాషలోనూ లేదని చెప్తూ ఉండేవారు. ధారణకు లొంగదు. ద్రవ ప్రాయంగా ఉంటుంది. ఇలాంటి చంచలమైన అంశం పట్టు దొరకడం లేదు.
సుమారు 15 సంవత్సరాలకు ముందు హైదరాబాదులో ‘కవి సమయం’
అనే ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్తూ శ్రీ సంపత్కుమార గారు నాచేత, శ్రీ మాదిరాజు
రంగారావు గారిచేత రెండు వచన కవితలు రాయించి అక్కడ
సమావేశంలో మామూలు వచనం లాగా ప్రకటించి, పాల్గొన్న
ప్రతినిధులైన కవులను ఎవరికి వారిని పాద విభజన చేసి అందించమని కోరారు. అయితే, ఏ ఒక్కరి
పాద విభజన మరొకరి విభజనతో సమానంగా లేదని వారు చెప్పారు.
కోవెల సుప్రసన్నాచార్య
రచనా కాలం: 19 ఆగస్టు, 2007






