27 June, 2026 | 1:30 AM

బీబీకాఆలం ఊరేగింపు

27-06-2026 12:00 AM

భారీగా తరలివచ్చిన ప్రజలు

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): మొహర్రం 10వ సంతాప దినం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో శుక్ర వారం బీబీకాఆలం నిర్వహించారు. ఏనుగు అంబారిపై డబీర్‌పుర నుంచి యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమం షేక్ ఫైజ్ కమాన్, అలిజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పం జేషా, మీర్ ఆలం మండి, పురానీ హవేలీ, దారుల్ షిఫా, ఎం.జీ.బీ.ఎస్, చాదర్ఘాట్ వరకు కొనసాగింది.

ఊరేగింపులో షియా ముస్లింలు ఆయుధాలతో తమ దేహంపై కొట్టుకుంటూ రక్తాన్ని చిందిస్తు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బీబీకాఆలంను చూడడానికి ప్రజలు రాష్ట్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. మొహర్రం హైదరాబాద్ సామరస్యానికి, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా భావిస్తారు. 

చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. కిరణ్ ప్రభాకర్ ఊరేగింపులో పాల్గొని, పరిస్థితిని సమీక్షించారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఊరేగింపు సజావుగా సాగింది. ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.