27 June, 2026 | 1:32 AM

భూ భారతి ఆపరేటర్లకు కష్టాలు

27-06-2026 12:00 AM
  1.   15 నెలల జీతాలు పెండింగ్
  2.   1,260 మందికి రూ.17 కోట్ల బకాయిలు
  3. ఎంత వేడుకున్నా స్పందించని అధికారులు

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి పోర్టల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు (ఫీల్డ్ టెక్నికల్ స్టాప్) 15 నెలలుగా సర్కార్ వేతనాలు విడుదల చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా  కలెక్టర్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయా ల్లో దాదాపు 1,260 మంది ఆపరేటర్లు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. సకాలంలో వేతనాలు అందకపోడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

చివరిసారిగా 2024 జూలై నుంచి 2025 ఫిబ్ర వరి వరకు బకాయి ఉన్న వేతనాలను చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత 2025 మార్చి నుంచి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదు. సుమారు రూ.17 కోట్ల మేర వేతనాలు బకాయి ఉన్నాయి. నెలనెలా ఇంటి ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తున్నదని మనోవే దనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను క్రమబద్ధీకరిస్తామని చెప్పి మాట తప్పడమే కాకుండా కనీసం వేతనాలను కూడా నెల నెలా ఇవ్వకపోవడం దారుణమని ఆపరేటర్లు వాపోతున్నారు. 

ప్రభుత్వానికి ఎన్నిసా ర్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు మొరపెట్టుకోగా ఇది తమ చేతిలో లేదని, సీసీ ఎల్‌ఏ నుంచే  చెల్లింపులు జరుగుతాయని చెప్పి చేతులు దులుపేసుకున్నారు. సీసీఎల్‌ఏకు ఎన్ని వినతులు సమర్పించినా స్పందన లేదని భూ భారతి ఆపరేటర్లు వాపోతున్నా రు. మంత్రులు, ఇన్చార్జి మంత్రులకు సైతం మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే  మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ధరణి ఆపరేటర్లను 2020 నవంబరులో దాదాపు 1,260 మందిని నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో భూ భారతి తీసుకురావడంతో అదనంగా మరో 1,260 మంది ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్ విధానంలో తీసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.21 వేలు వేతనం ప్రభుత్వం చెల్లిస్తోంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే కొనుగోలు దారుడికి డిజిటల్‌గా పట్టాదారు పాసుపుస్తకాన్ని  అందజేస్తున్నారు.