బీహార్ రణరంగం
రాష్ట్ర వ్యాప్త బంద్ హింసాత్మకం
లాఠీఛార్జ్.. 423 మంది అరెస్ట్
ఎస్పీ సహా 12 మంది పోలీసులకు, ముగ్గురు విద్యార్థులకు గాయాలు
పాట్నా, జూలై 25: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం బీహార్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వివిధ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్‌ఏ, ఆర్‌వైఏతో పాటు ప్రతిపక్ష పార్టీల మద్దతుతో శనివారం బీహార్ బంద్ హింసాత్మకంగా మారింది.
మొత్తం 10 జిల్లాల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య భారీగా ఘర్షణలు జరిగాయి. రాళ్ల దాడులు చేశారు. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించి, ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. పలుచోట్ల రహదారులపై టైర్లు తగలబెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. లాఠీఛార్జ్ చేశారు. దాడుల్లో ఎస్పీ సహా 12 మంది పోలీసులు, ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. మొత్తం 423 మందిని అరెస్ట్ చేశారు. బీహార్ రాజధాని పాట్నా, ఛప్రా, సివాన్ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు.
గాంధీ మైదాన్, జేపీ గోలంబర్, రామ్ గులాం చౌక్ వద్దకు వందలాది మంది విద్యార్థులు, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు గుమికూడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వాగ్వివాదం చెలరేగింది. ఘర్షణలకు దారి తీసింది. ఆందోళన కారుల దాడుల వల్ల పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
10 జిల్లాల్లో భారీగా ఘర్షణలు
రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య భారీగా ఘర్షణలు జరిగాయి. సీవాన్, ఛప్రా, సీతామఢీ, లఖీసారాయ్, భాగల్పూర్, ఔరంగాబాద్, గయ, సహర్సా, సమస్తీపూర్, ఆరా, పాట్నాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు మొత్తం 423 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాట్నా జిల్లాలోనే దాదాపు 100 మందిని పోలీసులు పట్టుకున్నారు. నిరసనల్లో పాల్గొన్న వారి పాత్రపై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బిహార్ పోలీస్ ప్రధాన కార్యాలయం వెల్లడించింది.
సీతామఢీ ఘర్షణల్లో ఎస్పీ అమిత్ రంజన్‌తో పాటు 12 మంది పోలీసులు గాయపడ్డారు. ఉద్రిక్తతల దృష్ట్యా నగరంలో 144 సెక్షన్ అమలు చేశారు. సీవాన్‌లో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు మొదట బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆ తర్వాత పది రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సీవాన్ జిల్లాలో విద్యార్థులపై నేరుగా కాల్పులు జరిపారని అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపిన వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.






