26 July, 2026 | 1:55 AM

మెడికల్ కౌన్సిలింగ్‌లో బడుగులకు అన్యాయం

26-07-2026 01:11 AM

జీవో 550 ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలి

ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): నీట్-2026 అనంతరం ప్రారంభం కానున్న ఎంబీబీఎస్ మెడికల్ కౌన్సిలింగ్‌లో జీవో నెం.114 అమలు వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.

జీవో నెం.550 ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ శనివారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కొత్త విధానం వల్ల ప్రతి సంవత్సరం 300 నుంచి 400 మంది రిజర్వేషన్ వర్గాల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోతున్నారన్నారు.

ఓపెన్ కేటగిరీలో మెరిట్ సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను రిజర్వేషన్ కోటాలో లెక్కించడం సుప్రీంకోర్టు తీర్పులు, మండల్ కమిషన్ సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిపారు. ఈ అంశంపై త్వరలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పాత జీవో 550 అమలుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నీల వెంకటేష్, జి.అనంత య్య, సి.రాజేందర్, పృథ్వి గౌడ్ ఉన్నారు.