ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం
- రోగి మృతి చెందినా వైద్యం చేశారు
- విషయం తెలియడంతో బంధువుల ఆందోళన
- ధర్నా చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు
- మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన
మేడిపల్లి, జూలై25 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రోగి మరణించిన విషయాన్ని దాచిపెట్టి, ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నామని చెబుతూ రూ.నాలుగు లక్షలకు పైగా వసూలు చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన శోభ (42) గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల 20న మేడిపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే స్టెంట్లు వేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో అడ్వాన్స్‌గా రూ.నాలుగు లక్షలు చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత రోగిని ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పి చివరికి శనివారం మధ్యాహ్నం శోభ మృతి చెందినట్లు వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేపట్టారు.
సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణలను ఆస్పత్రి వైద్యులు ఖండించారు. ఆమెకు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందారని, తమపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి.






