సర్టిఫికెట్ తంటాలు
- ఫీజురీయింబర్స్‌మెంట్‌కు, సర్టిఫికెట్లకు లంకె
- ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న కాలేజీ యాజమాన్యాలు
- విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మెడపై కత్తి
- డబ్బు చెల్లించలేక.. సర్టిఫికెట్లు పొందలేక విద్యార్థుల ఇబ్బందులు
- బకాయిలు విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని యాజమాన్యాల వేడుకోలు
హైదరాబాద్ జూలై 25 (విజయక్రాంతి): ‘ఓ విద్యార్థిని హైదరాబాద్‌లోని ఒక కాలేజీలో పీజీ పూర్తి చేసింది. బీఈడీ కౌన్సిలింగ్‌లో పాల్గొనేందుకు సర్టిఫికెట్లు అవసరమవడంతో సదరు కాలేజీ యాజమాన్యానికి సంప్రదిస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ తమకు రాలేదు. ఫీజు చెల్లించి అవసరమైన సర్టిఫికెట్లు తీసుకెళ్లొచ్చు’ అని బదులిచ్చారు. ‘మరో ఇద్దరు అమ్మాయి లు ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసుకుని ఎంటెక్ కోసం పీజీ ఈసెట్ రాశారు.
కౌన్సిలింగ్‌లో పాల్గొని బీటెక్, ఇతర సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయా ల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల కోసం కాలేజీ యాజమాన్యానికి సంప్రదిస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదు. సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు కట్టి తీసుకెళ్లండి’ అని బదులిచ్చారు. ఇలా ఈ రెండు కాలేజీలే కాదు..
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, లా, పాలీటెక్నిక్ కోర్సులందించే ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల పట్ల దాదాపు ఇలానే వ్యవహరిస్తుండటం గమనార్హం. విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత పై చదువులు, ఉద్యోగాలకు వెళ్లాలంటే చేతిలో సర్టిఫికెట్లు ఉండటంలేదు. దీంతో కాలేజీలు, యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. త మ సర్టిఫికెట్లు ఇప్పించాలని విద్యార్థులు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు.
ఫీజుకు, సర్టిఫికెట్లకు లింకు..
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంటెక్, ఎంబీఏ, లా, ఎంసీఏ తదితర వృత్తి విద్యా కోర్సులు అందించే కాలేజీలు 2500 వరకు ఉన్నాయి. వీటిలో ఇంజినీరింగ్‌లో ప్రతియేటా లక్షకుపైగా, డిగ్రీలో 2 లక్షలకుపైగా, పీజీలో సుమారు 40 వేలకుపైగా, పాలిటెక్నిక్‌లో 33 వేలకుపైగా, బీఈడీలో 14 వేల వరకు, ఫార్మసీలో 10 వేల మందికిపైగా, ఇతర కోర్సులు కలిపి మొత్తం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు సుమారు ఏడెనిమిది లక్షల మంది వరకు ఉంటారు.
వీరిలో కొంత మంది మధ్యలోనే చదువు ఆపేస్తుంటే మిగిలిన వారు ఉన్నత చదులకు వెళ్తున్నారు. వివిధ ప్రవేశ పరీక్షలు రాసి కౌన్సిలింగ్‌లో పాల్గొనాలంటే సర్టిఫికెట్లు అవసర మవుతున్నాయి. కానీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
పైగా సర్టిఫికెట్లకు, రీయింబర్స్‌మెంట్‌కు లింక్ పెడుతున్నారు. హైకోర్టు కూడా గతంలో విద్యార్థుల నుంచే ఫీజు వసూలు చేసుకోవాలని ఆదేశాలివ్వడంతో పలు కాలేజీలు విద్యార్థుల నుంచే ఫీజులను వసూలు చేసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజు బకాయిల కేసు ఇంకా హైకోర్టు విచారణలో ఉంది. బకాయిల చెల్లింపునకు ఆగస్టు 15 వరకు ప్రభుత్వం గడవు కోరడంతో తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేశారు.
చేతులెత్తేసిన అధికారులు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీల యాజమాన్యాలు తెగేసి చెప్పడంతో విద్యార్థులు యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యా, సాంకేతిక విద్యా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని ఫిర్యాదు చేస్తున్నారు. వాస్తవానికి నిబంధల మేరకు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఆపొద్దు. కానీ డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్ ఇవ్వమని లింకు పెడుతున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం చేతులెత్తేయడం గమనార్హం.
రోజుకు తమకు పదుల సంఖ్యలో ఇలాంటి ఫిర్యాదులొస్తున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాలేజీల యాజమాన్యాలు ఫీజులు వసూలు కాకుంటే కళాశాలలను ఎలా నడపాలని తిరిగి అధికారులనే ప్రశ్నిస్తున్నారు. కొన్ని కాలేజీలేమో ఉన్నతాధికారుల ఆదేశాలతో కౌన్సిలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్లను ఇస్తుంటే, మరికొన్నేమో ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
రైతుభరోసా తరహాలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏ ఏడాదికి ఆ ఏడాది రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలంటున్నాయి. సంక్షేమానికి వేల కోట్లు ఉంటాయి, విద్యకు ఎందుకు నిధులు విడుదల చేయడంలేదని విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి.






