26 July, 2026 | 2:11 AM

ప్రజాస్వామ్యం గెలిచింది

26-07-2026 01:00 AM
  1. వంచగలిగితే.. ప్రపంచమే వంగుతుంది
  2. సీజేఐ సూర్యకాంత్‌కు కృతజ్ఞతలు! 
  3. సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు అభిజీత్ దీప్కే 
  4. జంతర్‌మంతర్ వద్ద సంబురాలు
  5. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళి

న్యూఢిల్లీ, జూలై 25: ‘మేము మొదటి విజయం సాధించాం. ప్రజాస్వామ్యం గెలిచింది. భయపడకపోతే గెలవవచ్చనడానికి ప్రధాన్ రాజీనామానే నిదర్శనం. ఈ ప్రభుత్వం రాజీనామాలను చూడదని అనేవారు. ప్రపంచాన్ని వంచగల వారు ఉంటే, అది వంగుతుందని మేం అంటాం’ అని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అన్నారు. నీట్ లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిపదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

సంబరాలు మిన్నంటాయి. విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతం మార్మోగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అక్కడ గుమిగూడిన వారికి ప్రకటించారు. తమ ఉద్యమం మొదటి విజయాన్ని సాధించిందన్నారు. దీన్ని నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై 36 రోజులుగా సాగుతున్న తమ పోరాటంలో ఇది మొదటి పెద్ద విజయమని విద్యార్థులు, సీజేపీ సభ్యులు అభివర్ణించారు.

అదే సమయంలో, తమ మిగిలిన డిమాండ్లు నెరవేరే వరకు నిరసనను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీక్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కు సీజేపీ నివాళి అర్పించింది. ఈ సందర్భంగా దీప్కే మాట్లాడుతూ,  ప్రజాస్వా మ్యం గెలిచిందని, కేంద్రానికి యువత సత్తా ఏంటో చూపించామనిన్నారు. ‘ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి భయపడకూడదు. మనం గొంతు ఎత్తితేనే వారు దారిలో నడుస్తారు, ఎందుకంటే మన వల్లే వారు అధికారంలో ఉన్నారు’ అని తెలిపారు.

అయితే, ఉద్యమం కొనసాగుతుందని దీప్కే స్పష్టం చేశారు. ‘మాకు ఇంకా రెండు డిమాండ్లు ఉన్నాయి. మేము ఊరికే వెళ్లిపోము. మేము ‘కాక్రోచ్’ల (బొద్దింకల) లాంటి వాళ్లం. ఒకసారి లోపలికి ప్రవేశించాక, బయటకు వెళ్లము. ప్రస్తుతానికి ఒక రాజీనామా మాత్రమే జరిగింది. కాక్రోచ్‌తో పెట్టుకోవద్దు’ అని తెలిపారు. ప్రధాన్ తప్పుకోవడాన్ని ఉద్యమ మొదటి విజయంగా దీప్కే అభివర్ణించారు. మిగిలిన డిమాండ్లు బాధిత కుటుంబాలకు పరిహారం, పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపై చర్యలు ఇంకా నెరవేరాల్సి ఉందని పునరుద్ఘాటించారు.

అరాచకాలకు పాల్పడిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం, సీజేపీ ‘ఎక్స్’లో ‘మేము గెలిచాము’ అని పోస్ట్ చేసింది. నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించబడిన విద్యార్థుల స్మృతిలో నిరసనకారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మౌనం పాటించడానికి ముం దు దీప్కే చేతులు జోడించి, నేలకు నమస్కరించి, విద్యార్థుల పేర్లను చదివి వినిపించారు. 

నిరసనకారులపై బలప్రయోగం చేశారని పోలీసు సిబ్బందిపై చర్య తీసుకోవాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. ‘దేశ యువత హిందూ-ముస్లిం రాజకీయాలకు బలికాదు. మీరు అందులో చిక్కుకుపోతే, పేపర్లు లీక్ అవుతాయి, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది’ అని అన్నారు. దీనికి నిరసనకారులు ‘హిందూ, -ముస్లిం రాజకీయాలు చెల్లవు’ అని నినాదాలు చేశారు. ప్రపంచం తలవంచు తోం దని, దాన్ని తలవంచేలా చేసేవారు మనకు కావాలని దీప్కే పేర్కొన్నారు.

‘నేను అమెరికా విడిచిపెట్టినప్పుడు ఏమి జరుగుతుందోనని అం దరూ ఆశ్చర్యపోయారు. కానీ ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. నువ్వెం దుకు చేయడం లేదని ప్రతి రోజూ నన్ను అడిగేవారు. కానీ ప్రభుత్వం లొంగిపోయింది. ఇంకెంతకాలం కూర్చుంటారని అడిగారు. 36 రోజులులైన రాజీనామా ఉండదా అని నన్ను రోజూ అడిగారు. కానీ ప్రభుత్వం తలవంచింది. కానీ ఒక విప్లవం జరిగింది’ అని పేర్కొన్నారు.  

 సీజేఐకి కృతజ్ఞతలు..

కోర్టు విచారణల సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసినట్లుగా చెప్పబడుతున్న ‘బొద్దింక‘ వ్యాఖ్యను కూడా దీప్కే ప్రస్తావించారు. ఆ వ్యాఖ్య అనుకోకుండా ఉద్యమాన్ని బలోపేతం చేసిందన్నారు. నిరుద్యోగ యువతను బొద్ధింకలతో పోల్చుతూ ఈ సహజ ఉద్యమానికి బీజం వేసిన సీజేఐకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

‘మీరు మమ్మల్ని ‘బొద్దింకలు’ అని పిలవకపోయి ఉంటే, నేను భారతదేశానికి తిరిగి వచ్చేవాడిని కాదు. మీరు మమ్మల్ని ‘బొద్దింకలు’ అని పిలవకపోయి ఉంటే, దేశ యువత వీధుల్లోకి వచ్చేది కాదు. ‘మీరు మమ్మల్ని ‘బొద్దింకలు’ అని పిలవకపోయి ఉంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగి ఉండేది కాదు’ అని స్పష్టం చేశారు. 

నన్ను హీరోను చేయొద్దు

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు తనను హీరోను చేయవద్దని భావోద్వేగంతో దీప్కే అన్నారు. ‘ఒక వ్యక్తిని హీరోను చేయడం వల్లనే ఈ దేశం నాశనమైంది. ఒక వ్యక్తిని రాజ్యాంగం కంటే, వ్యవస్థల కంటే గొప్పవాడిని చేశారు. సమస్యకంటే వ్యక్తిని గొప్పగా చూసినప్పుడు, ఆ వ్యక్తి దేశాన్ని నాశనం చేయక తప్పదు, కాబట్టి ఎవరూ నన్ను హీరోను చేయవద్దు. భారత్‌మాతాకి జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించండి’ అని దీప్కే అన్నారు. పోరాడిన విద్యార్థులకు సెల్యూట్ చెప్పారు.

జంతర్‌మంతర్‌లో రాళ్లదాడి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనమా ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకా రులు సెక్యూరిటీ సిబ్బందిపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ స్పెషల్ సీపీ సహా ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారని పోలీస్ వర్గాలు తెలిపాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భద్రతాబలగాలు భాష్పవాయువును వదిలామని, స్వల్ప లాఠీఛార్జ్ చేశామని పేర్కొన్నాయి.