26 July, 2026 | 1:54 AM

విద్యార్థి విజయం

26-07-2026 12:47 AM
  1. ‘నీట్’పై దిగొచ్చిన కేంద్రం, డిమాండ్లకు అంగీకారం 
  2. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షతో ఊపందుకున్న పోరు 
  3. జంతర్‌మంతర్ వద్ద 26 రోజుల ఆమరణ దీక్ష 
  4. సీజేపీ ఉద్యమానికి టర్నింగ్ పాయింట్ 
  5. విద్యార్థి, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఏకం 
  6. విద్యావ్యవస్థలో కుదుపు.. తలొగ్గిన కేంద్రం 
  7.  విద్యార్థుల ఐక్యతకు తొలి విజయంగా సీజేపీ ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 25 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వివాదం రాజకీయ, విద్యా వర్గాల్లో పెను ప్రకంపనలనే సృష్టించింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వేదికగా చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష మరింత ఊపునిచ్చింది. 26 రోజుల పాటు కొనసాగిన దీక్ష దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజాసంఘాలను ఏకం చేసింది.   

జూన్ 20 నుంచి జూలై 15 వరకు దీక్ష

జూన్ 15న ఆవిర్భవించిన సీజేపీ.. తన పోరాటాన్ని ప్రారంభించింది. సీజేపీ దీక్షకు మద్దతుగా జూన్ 20న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణ దీక్ష ప్రారంభించిన వాంగ్‌చుక్..  జూలై 15వ తేదీ వరకు ఏకంగా 26 రోజుల పాటు కొనసాగించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆసుపత్రికి తరలించినా తన పోరాటాన్ని ఆపలేదు. సీజేపీ నేతలు ఆయనకు అనుక్షణం తోడుగా నిలిచారు. ఆయన భద్రత, విద్యార్థుల డిమాండ్ల కోసం సీజేపీ నాయకులు ప్రభుత్వంతో నిరంతరం పోరాడారు.

22న దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం

విద్యార్థులపై దాడి ఘటనతో ఉద్యమం మరింత ఉధృతమైంది. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు సీజేపీ ఉద్యమానికి తోడుగా నిలిచాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా విద్యార్థులకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దేశవ్యాప్త నిరసనల ఒత్తిడికి ఈనెల 22న కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి కక్షసాధింపు కేసులు పెట్టబోమని హామీ ఇచ్చారు. పేపర్ లీకేజీలపై వేగవంతమైన విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

24 తుది విజయం

ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహించాలని సీజేపీ గట్టిగా డిమాండ్ చేసింది. చివరికి ఈనెల 24న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త వినగానే జంతర్ మంతర్ వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు విజయోత్సవ నినాదాలు చేశారు.

ఇది తమ పోరాటానికి లభించిన మొదటి విజయమని సీజేపీ నేతలు ప్రకటించారు. విద్యార్థుల ఐక్యత ముందు ప్రభుత్వం తలవంచక తప్పలేదని ఈ ఉద్యమం నిరూపించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సీజేపీ స్పష్టం చేసింది. నాణ్యమైన విద్యా వ్యవస్థ, విశ్వసనీయమైన పరీక్షా విధానం కోసం నిరంతరం గళమెత్తింది. బాధిత అభ్యర్థులకు అండగా నిలిచి వారి పోరాటానికి బలమైన మద్దతుగా మారింది.

18న విద్యార్థులపై లాఠీచార్జి  

జంతర్‌మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు ఈనెల 18న భారీ ధర్నా నిర్వహించారు. పార్లమెంట్ వైపు మార్చ్‌గా వెళ్లేందుకు వారు యత్నించారు. అప్పటికే భారీగా మొహరించిన పోలీసు బలగాలు.. బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో వందలాది మది విద్యార్థులు గాయపడ్డారు. జంతర్‌మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. పోలీసుల అణచివేత చర్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.