బీహార్ ఫలితం విపక్షాలకు పాఠం
బీహార్ రాష్ర్ట శాసనసభకి జరిగిన ఎన్నికలు దేశ రాజకీయాలను, తెలంగాణ రాష్ర్టంలో జూబ్లీహిల్స్ శాసనసభకు జరిగిన ఉపఎన్నిక రాష్ర్ట రాజకీయా లను ప్రభావితం చేస్తుందనే అంచనాల నడుమ జరిగిన ఎన్నికలలో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష కూటములు, పార్టీలు ప్రతిష్టాత్మకంగా పోరాడినా ఎన్నికల్లో అధికార పక్షం విజయం సాధించటంతో విపక్ష పార్టీల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.
ముఖ్యంగా బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని ఎగరేసుకుపోతుంటే విపక్ష మహాఘఠ్బంధన్ నిస్తేజంగా చూస్తూ ఉండిపోయిందనే చెప్పాలి. 2020 బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చిన మహాఘఠ్బంధన్ ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలవ టం, 202 శాసనసభ స్థానాలలో విజయం సాధించి బీహార్ రాజకీయ చరిత్రలోనే ఎన్డీ ఏ ఒక సునామీ సృష్టించిందని ఫలితాల అనంతరం ప్రధాని మోదీ వ్యాఖ్యానించారంటే ఎన్డీఏ కూటమి ఏ స్థాయిలో విజ యాన్ని నమోదు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ర్టంలో కూడా జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ గెలుపు కోసం సర్వశక్తులొడ్డి పోరాడినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిలు వరించలేకపోవటంతో కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థి నవీన్ యాదవ్ 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు బీహార్.. ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో విపక్షాలు గెలుపు ముందు చతికిలపడితే, అధికార పక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి పైచేయి సాధించాయి.
బీహార్‌లో ‘నిమో’ సునామీ
243 శాసనసభ స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో 202 శాసనసభ స్థానాలలో జయకేతనం ఎగురవేసి నితీశ్, మోదీ కాంబినేషన్ చారిత్రాత్మక విజయం సాధించిం దనే చెప్పాలి. బీహార్ రాజకీయ చరిత్రలో ఇది ఎన్డీఏకి లభించిన ఒక ల్యాండ్ స్లుడ్ విక్టరీ. ఎన్డీఏ కూటమిలోని ఐదు పార్టీలు లోక్ జనశక్తి, జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామీ మోర్చా దళిత ఓట్లను, జనతా దళ్ యునైటెడ్, ఉపేంద్ర కుస్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా ఈబీసీ ఓట్లను, బీజేపీ భూమిహార్, రాజ్ పుత్ లాంటి అగ్రవర్ణాల ఓట్లను ఆకర్షించడంలో, సామాజిక సమీకరణాల కూర్పులో విజయం సాధించాయి కాబట్టే ఎన్డీఏకు ఈ స్థాయి విజయం సాధ్యమైంది.
బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం బీహార్‌కు ప్రకటించిన మఖానా బోర్డులాంటి వరాలు, నిధులు, ప్రాజెక్టులతో పాటు నితీష్ కుమార్ ప్రభు త్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళా ఓట్లే లక్ష్యంగా ప్రకటించిన మహిళలకు.. విద్యా ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు, మహిళా రోజ్ గార్ అభయాన్ కింద కోటి 25 లక్షల మంది మహి ళల ఖాతాలోకి పదివేల రూపాయలను జమ చేయడం, కోటి మంది మహిళలను లక్ పత్ దీదీలుగా మార్చుతామనే హామీ, జీవికా దీదీలకు వరాలు ప్రకటించటం, కోటి ఉద్యోగాలు, ఉచిత విద్యుత్, యువజ న కమిషన్, పెన్షన్ల పెంపులాంటి హామీలు ఎన్డీఏకి ఓట్ల వర్షాన్ని కురిపించి విజయతీరాలకి చేర్చాయి. సోషల్ ఇంజనీరింగ్, సంక్షేమ పథకాలతో నిమో కాంబినేషన్ బీహార్ శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసుకుంది.
తేజస్వీ ఒంటెద్దు పోకడలు
బీహార్ శాసనసభ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ గాంధీ కాంబినేషన్‌లో ని మహాఘఠ్బంధన్ (ఎంజీబీ) కూటమి కేవలం 35 శాసనసభ స్థానాల్లో విజయం సాధించి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎంజీబీ కూటమి పరాజయం ఏ స్థాయిలో కొనసాగిందంటే బీహార్ బావి ముఖ్యమంత్రిగా భావిస్తున్న తేజస్వీ యాద వ్ తమ కుటుంబానికి బలమైన రాఘోపూ ర్ నియోజకవర్గంలో ఒక దశలో వెనుకబడి చివరికి చెమటోడ్చి కేవలం 14 వేల ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించారు.
ఎంజీబీ కూటమిలోని ఏ ఒక్క పార్టీ కూడా మంచి ఫలితాలను సాధించలేకపోయాయి. ఆర్జేడి గతంలో తాను గెలిచిన సీట్లలో సగానికి పైగా కోల్పోయింది. గత రెండు శాసన సభ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీట్లు సాధించిన ఆర్జేడీ ఈ ఎన్నికల్లో మాత్రం మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కూటమిలోని మరొక ప్రధాన పార్టీ కాంగ్రెస్ కేవ లం 6 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ డిజిట్‌కే పరిమితమైతే, వామపక్షాలు కూడా గత ఎన్నికలలో సాధించిన తమ బలాన్ని కూడా నిలబెట్టుకోలేకపోవడం, ఐ.ఐ.పి పార్టీ ఒక్క స్థానానికే పరిమితమైతై.. వి.ఐ.పి పార్టీ ఖాతా కూడా తెరవలేదు.
కూటమిని సమన్వయంతో సరైన వ్యూహంతో ముం దుకి నడిపించలేకపోవటం, తేజస్వీ యాద వ్ ఒంటెద్దు పోకడలు, ప్రజా సమస్యలను వదిలేసి బీహారీ పేద ప్రజలకు అవసరం లేని ‘ఓట్‌చోరీ’ లాంటి అంశాన్ని రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేయటం మహాఘఠ్బంధన్‌ను పరాజయం అంచున నిలబెట్టాయి.
చిత్రమైన రాజకీయాలు..
బీహార్ శాసనసభ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్, ముఖేష్ సహానీలు బొక్క బోర్లా పడి తే, చిరాగ్ పాశ్వాన్, అసదుద్దీన్ ఓవైసీలు తమ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను అధికార పీఠాలు ఎక్కించిన ప్రశాంత్ కిషోర్ (పీకే) తన జన్ సురాజ్ పార్టీని బీహార్‌లో కనీసం గేమ్ చేంజర్‌గా కూడా నిలబెట్టలేకపోయా రు. ఓటమి తరువాత బిహారీలకు మా కొత్త రాజకీయం అర్థం కాలేదనే ముక్తసరి మాటలతో తప్పించుకునే ప్రయత్నం పీకే చేస్తు న్నారు.
అయితే జన్ సురాజ్ పార్టీ వైపు యువత కొంతమేర ఆకర్షితులవడం వల్ల మహాఘఠ్బంధన్ కూటమికి నష్టం జరిగిం ది. ఎంజీబీ కూటమి నుంచి ఉపముఖ్యమంత్రిగా ప్రకటించిన విఐపి పార్టీ అధినేత ముఖేష్ సహాని పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయింది. గత బీహార్ ఎన్నికల్లో ఒకే ఒక శాసనసభ స్థానంలో విజ యం సాధించిన ఎల్జేపీ (రామ్‌విలాస్) పార్టీ ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసిన 29 స్థానాలలో 19 స్థానాలను గెలవడమే కాదు దళిత ఓటు బ్యాంకును ఎన్డీఏ కూటమి వైపుకి మళ్ళించడంలో చిరాగ్ పాశ్వాన్ విజ యం సాధించారు.
ఎంఐఎం పార్టీ మరోసారి ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే కాదు సీమాంచల్ ప్రాంతం లో మహాఘఠ్బంధన్ విజయావకాశాలను దెబ్బ కొట్టింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయానికి సహకరించిన ఎంఐఎం పార్టీ బీహార్‌లో మాత్రం ఆర్జేడీ కూటమి ఓటమికి కారణంగా నిలిచింది. ఇలా విచిత్రమైన అవకాశవాద రాజకీయాలతో ఇండియా కూటమి తన విశ్వసనీయతను కోల్పోతుం ది. బీహార్‌లో విజయం తర్వాత ఎం.వై ఫార్ములాతో కొన్ని పార్టీలు గెలవాలనుకున్నాయి కానీ మాకు ఎం.వై అంటే మహిళ లు, యువత అని ప్రధాని చెప్పడం చూ స్తుంటే బీహార్‌లో గెలవటానికి ఎన్డీఏ ఎంత వ్యూహాత్మకంగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.
అదొక్కటే ఊరట!
శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు పార్టీ తన సిట్టింగ్ స్థానాలను కోల్పోవడం రెండింటిలోనూ అధికార హస్తం పార్టీ విజయం సాధించ టం కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి వచ్చే అం శమే. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. ఉప ఎన్నికల్లో గెలవటానికి అవకాశం ఉన్నా, విజయం సాధించడంలో కారు పార్టీ వెనకబడిపోయింది.
ఉప ఎన్నికలలో ఓటమి ఎదురైతే జరిగే పరిణామా లు పూర్తిగా తెలిసిన ముఖ్యమంత్రి గెలుపు కోసం తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుంటే తన పార్టీని గెలిపించుకోవడానికి పార్టీ శ్రేణుల్లో స్థుర్యైన్ని నింప డానికి కేసీఆర్ ఒక్కరోజు కూడా ప్రచారాని కి రాకపోవడం రాజకీయ వ్యూహాత్మక తప్పిదంగా చూడాలి. బలహీనవర్గాల అభ్యర్థిని నిలబెట్టడం, ఫలితాన్ని ప్రభావితం చేసే మైనార్టీ వర్గాలను తమ వైపుకు తిప్పుకోవడం, పోల్ మేనేజ్‌మెంట్‌ని పకడ్బందీగా అమలు చేసి అధికార పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఉప ఎన్నికల్లో ఓడినా అధికార పార్టీకి ధీటుగా ఎదురు నిలిచి పోరాడటం, గత శాసనసభ ఎన్నికల్లో వచ్చి న ఓట్లను నిలబెట్టుకొని రెండో స్థానంలో నిలవడం, బీజేపీకి డిపాజిట్ రాకపోవడం బీఆర్‌ఎస్‌కు కొంత ఊరటనిచ్చే అంశం.
వ్యాసకర్త సెల్: 9885465877




